తప్పని సరి పనులు,తక్షణ పనులు

తప్పని సరిగా చేయవలసిన పనులు, తక్షణమే చేయవలసిన పనులు అని పనులు రెండు రకాలు తప్పక చేయవలసిన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేసుకుంటూ పోకపోతే అవి గొంతుమీదకు వస్తాయి. అనుకోకుండా వచ్చిపడేవి ఆర్జెంటు పనులు తప్ప పేరబెట్టి పేరబెట్టి ఆఖరి ఘడియలో చేసేవి ఆ కోవకు రావు. ఒక వ్యాధిని ముందే చూపించుకోగలిగితే మామూలు మందులతోనే నయం కావచ్చు. ముదిరిపోయిన తర్వాత అత్యవసర చికిత్స చేసినా ఫలితం వుండకపోవచ్చు.పరీక్షలకు ముందుగా చదువుకోకపోతే దగ్గరకొచ్చాక పరుగులు తీసి ముక్కునపట్టుకుని రాయాలి. పనులైనా అంతే. ఉదాహరణకు ఒక బిల్లు కట్టడానికి వున్న వ్యవధినంతా పోగొట్టుకుంటే అది ప్రాణం మీదకు వస్తుంది. అంత ఆదరాబాదరాగా చేసేప్పుడు నాణ్యత కూడా దెబ్బతినిపోవడం సహజం.ఎలాగోలా పూర్తిచేయడం తప్ప చేయాలనుకున్నట్టు చేయడం వుండదు. అదే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే ప్రామాణికంగానూ చేసుకోవచ్చు. ఇదో ప్రాథమిక సూత్రం. చాలామంది పాటించనిది. కాల యాపన చేసి చేసీ అనివార్యమైన స్థితిలోనే దాన్ని నిర్వహించబోవడం వల్ల పని పూర్తవడమే పదివేలు అన్నట్టు వ్యవహరిస్తాము. కుందేలు తాబేలు సామెత ఇలాటిదే. కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే లక్ష్యాన్ని తప్పక చేరుకోవచ్చు. అలాగాక అతి ధీమాతో అలక్ష్యంతో సమయం వృథా చేసుకుంటే తర్వాత సంతృప్తి వుండనే వుండదు. సమర్థనలు సంజాయిషీలే మిగులుతాయి.
కాలాన్ని వినియోగించుకోవడంలో ప్రధానమైన వాటికి ఎక్కువ సమయం, చురుకైన సమయం తీసుకోవాలి. దానికి భంగం కలిగించే అంశాలను వ్యక్తులను అనుమతించకూడదు.తమ సమయం విలువే తెలియని వారికి ఇతరుల సమయం విలువ తెలుస్తుందనుకోవడం భ్రమ. కొందరు తమ సమయం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరుల సమయాన్ని హరించేందుకు మాత్రం వెనుకాడరు.ఉదాహరణకు ఇలాటి వారు మిమ్మల్ను కలుసుకోవాలంటే వాళ్లకు అనుకూలమైన సమయం అడుగుతారు తప్ప మీ కష్టనష్టాలు పట్టించుకోరు. నిర్మొహమాటంగానూ మర్యాదగానూ ఇలాటి వారికి సరైన సమాధానమిచ్చి ఎవరికీ నష్టం లేకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా ఒక పట్టాన వదలకుండా దాడి చేస్తుంటే సూటిగానూ సున్నితంగానూ సాగనంపాలి. మీ ప్రమేయం లేకుండా సమయం సందర్భం చూడకుండా వూడిపడితే మొహమాటపడనవసరం లేదు. ఒకసారి గాక అదే అలవాటుగా మార్చుకున్నవారిని అసలే మన్నించనవసరం లేదు. కుటంబాలలో గాని కార్యాలయాలలో గాని శిక్షణా రాహిత్యం అలవాటుగా హక్కుగా చేసుకుని దానివల్ల మీ సమయం హరించబోవడాన్ని అనుమతించబోమని స్పష్టంగా చెప్పాలి. కాకపోతే అందులో మన వంతు వరకూ క్రమబద్దంగా చేసి ఆ పైన ఎవరి మానన వారిని వదిలేయాల్సిందే. తమ సుఖ సంతోషాలను చూసుకుంటూ ఇతరులపై భారాలు మోపేవారికంటే వాటిని మోసేవారిదే ఎక్కువ తప్పు.
విలువైన సమయం… విసుగెత్తే పనులు…
టీవీలలో ప్రైమ్‌ టైమ్‌ అంటూ వుంటారు.అంటే విలువైన సమయం అన్న మాట. టీవీలకే కాదు దైనందిన జీవితంలో కూడా ఈ తేడా వుంటుంది. కొంతమంది తెల్లవారుఝామున మరికొందరు కాస్త పొద్దెక్కాక ఇంకా కొందరు బాగా ఆలస్యంగా నిద్ర లేవడం దగ్గరే ఈ తేడా మొదలవుతుంది. ఎన్టీరామారావు త్వరగా పడుకుని తెల్లవారుఝామున రెండున్నరకే లేచి తెల్లవారే సరికి యోగాసనాలు పనులు పూర్తి చేసుకునేవారు. జీవితంలో తీరిక లేకుండా పని చేసేవారందరి పొదుపు లేవడం దగ్గరే మొదలవుతుంది. ఈ విషయంలో మీ పరిస్థితి ఏమిటో చూసుకోవడం మంచిది. మీరు ఆలస్యంగా లేచినా ప్రపంచం ముందే సిద్దమై పోతుంటుంది. అక్కడే సగం దెబ్బ తిన్నారన్న మాట….
నిద్ర లేవడం, నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకోవడం ఎంత సమయం తీసుకుంటుంది? లేదా మామూలు భాషలో చెప్పాలంటే రెడీ కావడం ఎంత త్వరగా చేసుకోగలుగుతారనే దానిపై చాలా సమయం కలసి వస్తుంది. ఆడవాళ్లు రెడీ కావడానికి చాలా సమయం తీసుకుంటారని జోకులేస్తుంటారు గాని వాస్తవంలో పురుష పుంగవులు చాలా మంది ఒక పట్టాన తెమలరు. అంత ఆలస్యం ఎందుకవుతుందో కూడా తెలియకుండానే సాగదీసి సమయం వృథా చేస్తుంటారు. వారి కోసం మొత్తం అందరూ నిరీక్షణలో మునిగి వుండాల్సి వస్తుంది.ఈ రెంటినీ సరిచేసుకోగలిగిత సగం సమయం కలిసి వచ్చినట్టే.
ఇక ప్రైమ్‌ టైమ్‌ సంగతి. రోజూ చూడండి- 9 గంటలకు అటూ ఇటూగా రోడ్లన్నీ కిక్కిరిసి వుంటాయి. అలాగే సాయింత్రం 5-7 మధ్యన కూడా. అంటే ఇవి చాలా కీలకమైన వేళలన్న మాట. మీ వృత్తిని బట్టి మీకూ ఏదో సమయం వుంటుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని నిరర్థకంగా పోగొట్టుకోకూడదు.ఆ సమయంలో ఎవరో ఆగంతుకులు వచ్చారని నిస్సహాయంగా బలైపోకూడదు.మీ సమయం మీ చేతుల్లో వుండాలి.మీకు బాగా ఇష్టమైన అవసరమైన పనులకోసం సరైన సమయాన్ని ఎంచుకుని వినియోగించుకోవాలి. మీరు బాగా పనిచేయగలిగే సమయంలో కొంతైనా కుటుంబం కోసం వెచ్చించాలి. లేకుంటే అలసి సొలసి కేవలం సపర్యలు చేయించుకోవడానికి మాత్రమే గృహ ప్రవేశం చేసేట్టయితే మీరు అతిధిలుగానే మిగులుతారు.అలాగే కుటుంబానికి సంబంధించిన చిన్న చితక పనులలోనే మునిగితేలుతూ సమాజానికి సంస్థలకు సంబంధించిన కీలకమైన పనులను నిర్లక్ష్యం చేస్తే మీరు స్వార్థపరులై పోతారు. రెంటినీ సమన్వయం చేసుకునే విధంగా సమయ పాలన జరగాలి. నాణ్యమైన సమయాన్ని నాణ్యమైన పనులకు కేటాయించుకోవాలి. అలాగే ఏ పనైనా ఎప్పుడైనా చేయగల నైపుణ్యం సంతరించుకోవాలి.
కాలాన్ని గొప్ప సామ్యవాది అందరికీ ఒకే విధంగా అందుబాటులో వుంటుంది అంటారు గాని అది పూర్తిగా నిజం కాదు. పని చేసే వారంతా ప్రైమ్‌టైమ్‌ యాజమాన్యాలకు ధారాదత్తం చేసినట్టే లెక్క. అది గాక మిగిలిన సమయంలోనే విచక్షణగా ఉపయోగించుకోవడం సాధ్యపడుతుంది. కనక ఇలాటి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక వేళ కార్యాలయాల్లో వత్తిడి లేదని సుత్తి వేసుకుంటూ గడిపేస్తే మరింత నష్టం.
మహిళలు కబుర్లలో మునిగితేలతారు అని ఆడిపోసుకోవడం తప్ప కార్యాలయాల్లో కాపీ హౌటళ్లలో దమ్మిడికీ పనికి రాని దండగ మాటలతో వృథా చేసే వారు అందరిలోనూ వుంటారు. ఇప్పుడు సెల్లుఫోన్‌ వచ్చాకనైతే అరగంట అనవసరమైన మాటలతో గడిపేయం సర్వసాధారణమై పోయింది. ఇవన్నీ కాలాన్ని మిగుల్చుకోవడానికి మార్గాలు.
కొంతమంది పొద్దు పోవడం లేదు అంటే మరికొంత మంది సమయం చాలడం లేదు అంటుంటారు. ఈ రోజుల్లోనైతే బిజీ బిజీ అంటూనే లేజీగా గడిపేవారికి కొదువ లేదు. మీరు కబుర్లలో మునిగి తేలి సమయం పోగొట్టుకోవచ్చు. టీవీ ముందే గంటల తరబడి కరగించేయవచ్చు. కనక సమయం చాలడం లేదనడానికి కారణమేమిటన్నది ఆలోచించుకోవాలి. ఇది జరగాలంటే ఖాతా పుస్తకాల తనిఖీ(ఆడిటింగ్‌) లాగా టైమ్‌ ఆడిటింగ్‌ చేసుకోవాలి. ఎంత సమయం ఎంత ప్రయోజన కరంగా గడిపాము అనేది విమర్శనాత్మకంగా చూసుకుంటే తెలుస్తుంది.తద్వారా దేనికి ఎంత సమయం అవసరం అన్నది కూడా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవడం కూడా సులభమవుతుంది.
రైతు రుతువును బట్టి పంట వేసుకున్నట్టే ప్రతివారూ కాల క్రమణికను బట్టి కర్లవ్యాలు రూపొందించుకోవాలి. ఎందుకంటే మనకోసం ఏదీ ఆగదు. మనం కోరుకున్నంత మాత్రాన ఏదీ జరగదు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయవచ్చన్న మాట నిజమే గాని అది నిర్దిష్టమైన కాలమాన పరిస్థితుల్లోనే సాధ్యమవుతుంది.కనక మొదట చేయవలసింది కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, కాల గమనాన్ని సవ్యంగా అర్థం చేసుకోవడం.
వారానికేడు రోజులు మనకి .. రోజుకు ఇరవై నాలుగు గంటలు
వాడుకో మానుకో అంతే జీవితం.. అంటూ రష్యన్‌ కవి వ్లదీమర్‌ మయకోవస్కీ గొప్ప సత్యాన్ని కవితాత్మకంగా చెప్పాడు.
కొత్త ఏడాది ఈ తరుణంలో అంతకుముందు కాలాన్ని కూడా దృష్టితో పెట్టుకుని గడిచి పోతున్న ఏడాదిని పరిశీలించుకుంటే మరింత మెరుగైన నూతన సంవత్సరాన్ని రూపొందించుకోగలుగుతాము. అందుకు ఆట్టే వ్యవధి లేదు గనక వెంటనే రంగంలో దిగండి మరి. సకాలంలో చేస్తే సకలం సాధ్యమే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *