కొత్తచూపుతో పదండి ముందుకు….

కళ్లముందు సత్యం, కరిగిపోయే స్వప్నం కాలం. ఆనకట్ట వేసుకుంటే నిల్వవుండిపోయే నదీ జలం వంటిది కాదు, వున్నప్పుడే వినియోగించుకోకపోతే తర్వాత దక్కని విద్యుచ్చక్తి వంటిది కాలం. ఎంతగా మనిషిని శాసించడానికి ప్రయత్నిస్తుందో తనను అదుపులో పెట్టగలిగిన వారికి అంతగా లోబడిపోయేది కాలం అన్నాడు శ్రీశ్రీ. జీవితంలో అనేక సమస్యలు వుండొచ్చు వుంటాయి.కాని అనుకున్న ప్రకారం పనిచేస్తూ ఆలోచననూ ఆచరణనూ ఆశలనూ ఆశయాలనూ మేళవించుకోగలిగినప్పుడు సంతోషం సంతృప్తి మీ స్వంతమే.అలాటి అంచనాకు అందివచ్చిన అద్భుత సందర్భం నూతన సంవత్సరాగమనం.

ఎక్కడ మొదలు,ఎక్కడ ముగింపు..
తెలుగులోనైతే దుర్ముఖి, విజయ, వికృత, ప్రభవ ఇలా సంవత్సరాలకు పేర్లున్నాయి గాని ప్రపంచమంతా చలామణిలో వున్న ఇంగ్లీషు క్యాలెండర్‌కు అంకెలే. ఏది ఏమైనా ఏడాది కొండ గుర్తు అనుకుంటే ఏడాది కిందట లేదా ఈ ఏడాదిలో ఏమనుకున్నాము, ఏం చేశాము, అసలేమైనా అనుకున్నామా? ఏమీ అనుకోకపోతే ఇప్పుడైనా వచ్చే ఏడాదికైనా ఏమైనా అనుకుందామా అని చూసుకోవలసిందే. అలాటి ఆలోచనే లేకపోతే జీవితం చీకట్లో తడుములాటగానే మారిపోతుంది. ప్రతి వారికి ఏవో ఆకాంక్షలు ఆశలూ ఆశయాలు వుండనే వుంటాయి. తమ విద్యావుద్యోగవృత్తి వ్యాపారాలు కుటుంబాలకు సంబంధించి ఏదో అనుకుంటూ వుంటారు. మరి కొద్ది శాతం మంది సమాజ పరంగా సంస్తాగతంగా ఫ్రణాళికలు అనుకుని వుంటారు. పాత పద్ధతులు సరిగ్గా లేకపోతే కొత్త పుంతలు తొక్కాలని భావించి వుంటారు. ఇదో నిరంతర ప్రక్రియ. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా చెప్పుకున్నా చెప్పుకోకున్నా ఫలానా ఫలానా అని అనుకుంటుంటారు. డైరీలు రాసే అలవాటున్న వారు లేదా నోట్‌ప్యాడ్‌లు వుపయోగించేవారు కొంతమందైతే అనేక మంది ఆలోచనలు వారి మస్తిష్కాల్లోనే బంధితమై వుంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో వాటిని పునరంచనా వేసుకోవలసిందే.

.మన శక్తి సామర్థ్యాలు పెంచుకున్నామా లేక ఏ కారణంగానైనా తగ్గు ముఖం పట్టాయా? ఇప్పుడెలా పెంచుకోవాలి?
.వున్న శక్తికి తగిన ఫలితాలు సాధించగలిగామా? ఫలితాలు ఎలా సాధించడం?
.ఆర్థిక స్తితిగతులు అదుపులోనే వున్నాయి కదా, శక్తికి మించిన భారంలో కూరుకుపోయామా? పోతే బయిటకెలా రావాలి?
.కుటుంబం పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను సవ్యంగా నెరవేర్చినట్టేనా? చేయగలిగీ చేయలేకపోయినవేమైనాఈ ఏడాది ఎలా చేయాలి?
.మంచిని ప్రోత్సహించనడానికి, చెడును నిరోధించడానికి ఈ ఏడాదిఎలా అడుగేయాలి?
.పిల్లల పట్ల, జీవిత భాగస్వాముల పట్ల, పెద్దల పట్ల మన వంతు శ్రద్ద పెంచడమెలా?
.ఏ విషయంలోనైనా ఆశాభంగం కలిగివుంటే మళ్లీ అలా జరక్కుండా ఏం చేయాలి?
కొత్త విషయాలు నిపుణతలు ఏ మాత్రమైనా సాధించడానికి ఏంచేయాలి?
క్రమ శిక్షణ, శ్రమ శిక్షణ ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలి?
.మనను అభిమానించే ఆదరించే వారి పట్ల బాధ్యత నెరవేర్చడం ఎలా?
ఇతరులతో మన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం ఎలా?
ఇలా అనేకానేక కోణాల నుంచి కొత్త ఏడాది ప్రణాళిక రూపొందించుకోవాలి. గత ఏడాదిలో సానుకూల ఫలితాలుంటే మరింత మెరుగుచేసుకోవచ్చు. ప్రతికూల ఫలితాలుంటే సరిదిద్దుకోవచ్చు. అనుకున్నది సాధించామా లేదా అని చూసుకొన్నప్పుడు మనకు మనమే మార్కులు వేసుకునే మాష్టార్లలాగా నిర్ణయాలకు రావచ్చు. ఫలితాల అంచనాలో ఇతరుల పట్ల ఒకింత ఉదారంగా వుండొచ్చునేమో గాని ఎవరికి వారు మినహయింపులు ఇచ్చుకోకూడదు. సమాజం అంటే వ్యక్తుల సమూహమే గనక వ్యక్తిగత స్థాయిలో జరిగే ఈ పరిశీలనలు అందరికీ ఉపయోగపడతాయి.. నిర్దాక్షిణ్యంగా అందులో సంతోషించవలసింది వుంటే తమ వరకూ తప్పక సంతోషించి ఆ పైన సమిష్టి అంచనా కోసం ఎదురు చూడాలి. ఆ రెంటికీ తేడా వస్తే మరోసారి పరిశీలించుకోవాలి. అంతేగాని విమర్శలు వస్తే భరించలేకపోవడం లేదా అవన్నీ నిజమేఅనుకుని అతిగా క్రుంగి పోవడం తగని పనులు.

ప్రాధాన్యతా క్రమం
జీవితంలో ప్రాధాన్యతా క్రమం చాలా కీలకమైంది. ఏది ప్రథమం, ఏది ద్వితీయం ఏది ఫ్రధానం ఏది అప్రధానం అన్న విచక్షణ వుండాలి. ప్రధానాంశాల్లో ప్రగతికి ప్రాముఖ్యత నిచ్చి పరిశీలించుకోవాలి. అందరూ అన్ని వేళలా ఒకే ప్రాధాన్యతలు పాటించడం అనవసరం. దాని వల్ల శక్తి యుక్తులు పూర్తిగా సద్వినియోగం కావు కూడా. ఎవరైనా తమ జీవిత గమనాన్ని పని విధానాన్ని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ అవగాహనకు అనుగుణంగా ప్రాధాన్యతలు రూపొందించుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మంత్రం పనికి రాదు.ఉదాహరణకు ఒక వుద్యోగి, ఒక వ్యాపారి, రాజకీయ నాయకుడు, కళాకారుడు, సామాజిక కార్యకర్త, ఒక వైద్యుడు, ఒక న్యాయవాది ఇలా అందరికీ వర్తించే సూత్రం వుండదు.వారి వారి పని ఫలితాలను కూడా ఒకే ప్రమాణంతో తేల్చలేము. కనకనే గడచిపోయిన కాలాన్ని వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు అతిగా పొంగిపోయినా అనవసరంగా కుంగిపోయినా తప్పే అవుతుంది. ఒక వేళ ఆశించిన ఫలితాలు కలక్కపోయినా అనేక అపశ్రుతులు ఎదురైనా కాలం అక్కడే ఆగిపోదని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు ప్రతివారికోసం పరుచుకునే వుంటుంది.
. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాననే విశ్వాసం ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే వ్యక్తిత్వ వికాసం తోే పాటు పదిమందితో కలసి నడవడంలో వున్న సహజీవన సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తులుగానే గాక సమూహాలుగానూ సమీక్షించుకోవాలి. అందులో మొదటిది కుటుంబం.
కుటుంబం ఎప్పుడూ ప్రజాస్వామిక ప్రక్రియలో వుండేలా చూసుకోవాలి. అందుకు మొదటి మెట్టు ఉమ్మడిగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం,ఆ దిశలో నడతను పరిశీలించుకోవడం. జరగాలి.
.కుటుంబంలో తరచూ ప్రస్తావనకు వచ్చే సమస్యలు
.ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత
.చదువు సంధ్యలపై తగు శ్రద్ద
.జమ ఖర్చుల నిష్పత్తి అదుపులో వుంచుకోవడం
. అనవసరమైన వాటిని కొనడం, అత్యవసరమైన వాటిని దాటేయడం జరుగుతున్నదా?
.ఏడాదిలో ఒక్కసారైనా ఏదైనా చిన్నదో పెద్దదో పర్యాటక యాత్ర
.స్నేహ సంబంధాలు మన కారణంగా ఏవైనా సంబంధాలు దెబ్బతిని వుంటే పునరుద్ధరించుకోవడం ఎలా?
. కుటుంబ నిర్వహణ భారం క్రమ బద్దంగా పంపిణీ శ్రుతిమించిన బద్దకాన్ని వదిలించుకోవడం
.గృహిణికి కనీస విశ్రాంతి విరామం
.రేపటి తరం మనుషులైన పిల్లలల జీవితం పట్ల సరైన దృక్పథం వారి పురోగతికి సహకారం
.దురలవాట్లు లేదా అరాచకత్వం ఛాయలు కనిపిస్తున్నాయా? బద్దకం మనను మింగేస్తున్నదా?

సమిష్టి బృందాలు,్ణ
ఇక సంస్థలు ఏ విధమైనవైనా సరే వాటికి కొన్ని లక్ష్యాలుంటాయి. లక్షణాలుంటాయి. గమ్యాలుంటాయి.గమనమూ జరిగివుంటుంది. అందులో పైనున్న బాధ్యుల నిర్వాహకులు లేదా యజమాన్యాలు నిర్ణయించే విషయాలు అనేకం వుంటాయి. అయితే అమలుకు వచ్చేసరికి మళ్లీ సమిష్టిగానే అమలవుతాయి. ఆ పరిధిలో సంస్థల పురోగమన తిరోగమనాలు అందరికీ కనిపిస్తుంటాయి. అయితే పైకి కనిపించేవాటితోనే అంతిమ నిర్ధారణలకు రావడం సరికాదు. నిర్వాహకులు మోస్తున్న విషయాలు చాలా వుంటాయి.కనక వీటిలో ఉమ్మడి నియమావళి పరిధిలో పరిశీలన చేసుకోవలసి వుంటుంది. విద్యా సంవత్సరం ఒక మాసంలో ఆర్థిక సంవత్సరం మరో మాసంలో వ్యవసాయం మరో తరుణంలో ముగింపునకు వస్తాయి గాని కాలక్రమణిక మాత్రం ఒకే విధంగా వర్తిస్తుంది. కనక సమిష్టిగానూ వ్యక్తిగతంగానూ జరిగింది జరగాల్సింది చూసుకోవడానికి సంవత్సరాది సరైన తరుణం. పైగా విద్య ఆర్థిక సంవత్సరాలలో మిగిలిపోయిన లక్ష్యాలను గబగబా పూర్తి చేసుకోవలసిన అవసరం ఏమిటో కూడా ఇప్పుడే చూసుకుంటే చాలా మేలు కలుగుతుంది. అలా చూసుకున్నప్పుడు కనిపించిన లోపాలను తొలగించుకోవడం కోసం మనసా వాచా కృషి చేయాలి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *