లెక్కలు చెప్పలేదు- చిక్కులు తీర్చలేదు

నాకు యాభై రోజులు ఇవ్వండి.. అన్నాడాయన. ఆ తర్వాత చూడండి అన్నారు అనుయాయులు. కష్టంగానో నష్టంగానో భారతీయులందరూ భరించారు. తీరా ఈ రోజు ఆయన చేసిన ప్రసంగం సారం లేని సూక్తులతోనూ, సాధారణ రాయితీలు పథకాల ప్రకటనతోనూ ముగిసింది. కాకపోతే సామాన్యుడు నవ్వుతున్నాడని మోడీ ఆయనను కాపీ కొట్టినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చిన మాట ఈ రోజు చెప్పడానికి సాహసించలేకపోయారు. తమ డబ్బు తాము తీసుకోవడానికి ప్రజలు కష్టపడ్డారని ఒప్పుకున్నారు. అయితే ఈ యాభై రోజలు ముగిశాయి గనక ఆ కష్టాలు ముగిశాయంటూ మార్పులు ప్రకటించింది లేదు. అంటే కొత్త ఏడాదిలోనూ పాత కష్టాలు తప్పవన్నమాట. బ్యాంకు సిబ్బంది అవినీతి గురించే ఇప్పటి వరకూ మాట్లాడింది పోయి ఈ ప్రసంగంలో మాత్రం వారి కష్టాల గురించి చెప్పారు. మంచిదే. అయితే బ్యాంకులకు బాగా డబ్బు వచ్చి చేరింది గనక పేద మధ్యతరగతి మనుషులపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చిన ప్రధాని ఆ మేరకు పథకాలేమీ చెప్పింది లేదు. పైగా వాటి దివాళాకు కారణమైన బడాబాబుల ఎగవేతలపైనా ఏ చర్యలూ చెప్పింది లేదు.
అసలు సామాన్యులను సమిథలుగా చేసి సాగించిన ఈ యజ్ఞ ఫలం ఏమిటి? ఎంత నల్లడబ్బు పట్టుకున్నారు? అంచనాలు ఎందుకు విఫలమైనాయి? చెబితే ఒట్టు. ఒప్పుకోని వైఫల్యం ఆయన ప్రసంగమంతటా కమ్ముకుని వుంది.నవంబరు 8న సాక్షి స్టూడియోలో ఆయన ప్రసంగం విన్నప్పుడు సర్జికల్‌ స్ట్రయిక్‌ అంటూ యుద్ధ స్థాయిలో మాట్టాడితే ఇప్పుడు నీరసం నిస్తబ్దతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం స్పష్టమైంది. ఇప్పుడు నోట్ల విడుదల పెంచుతున్నారా? విత్‌ డ్రా ఆంక్షలు తొలగిస్తున్నారా? చెప్పింది లేదు. పెద్ద నోట్లను రద్దు చేస్తామంటూ వున్నవాటికంటే పెద్దదైన 2000 తెచ్చారు గాని ఈ ప్రసంగంలో దాన్ని రద్దు చేస్తారని వూహలు నడిచాయి. దానిపైనా వివరణ లేదు.
24లక్షల మంది మాత్రమే 10 లక్షలపైన ఆదాయం ప్రకటించడాన్ని ప్రధాని తప్పు పట్టారు .బాగానే వుంది. వేల కోట్లు బాహాటంగా ఎగవేసిన వారి మాట ఎందుకు ప్రస్తావించలేదు? ఈ దేశంలో సంపద కేంద్రీకరణ నిజం కాదని ఆయన అనుకుంpm-modi-emotional_650x400_41479022763టున్నారా? పోనీ తమ లెక్కల ప్రకారం ఎంతమంది వుండాలి? భారీ లాభాలు అక్రమ సంపద పోగుపోసుకుంటున్నవారిపై ఎక్కువ పన్ను వేసేబదులు ఎక్కువ మందిని పన్ను వ్యవస్థలోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ మాటలతో తేటతెల్లమైంది.
గృహ నిర్మాణం పెంపు, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, రైతుల రుణాలపై వడ్డీ రెండు మాసాల పాటు తగ్గింపు, వ్యాపారులకు రుణ సదుపాయం కోటి నుంచి రెండు కోట్లకు పెంపు ప్రధాని ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పథకాలు. వీటికీ నోట్లరద్దుకూ సంబంధమేమిటి? ఇలాటివి ఎప్పుడూ వుంటున్నవే.ఇక ప్రసూతి సమయంలో స్త్రీలకు 6 వేలు ఇస్తామన్నారు మంచ్‌ిదే గాని ఇలాటివి అనేకం గతంలోనూ వున్నాయి. ఇవి నిజానికి బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పాల్సినవి. బహుశా యుపి పంజాబ్‌ ఎన్నికల కోసం ముందే ప్రకటించారు.

ప్రధాని రాయితీలుగా ప్రకటించిన కొన్ని అంశాలలో నిజానికి భారాలు దాగి వున్నాయి. బ్యాంకుల డిపాజిట్టు పెరిగాయి గనక ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోనున్నట్టు పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ తగ్గింపు నుంచి సీనియర్‌ సిటిజన్లకు మాత్రం అది కూడా పాక్షికంగానే రక్షణ కల్పించి 8 శాతం కొనసాగిస్తామన్నారు. అంటే డబ్బు తీసుకోలేని దురవస్థతో పాటు వుంచిన దానిపై వడ్డీ కూడా కోత పడుతుందన్న మాట.
అంతగా చెప్పిన నగదు రహితం గురించి ఈ ప్రసంగంలో పెద్దగా చెప్పలేదు. కాని డిజిటల్‌ లావాదేవీలపై అదనంగా పడే 8 శాతం సుంకం లేకుండావ్యాపారులకు 6 శాతం వుండేలా చూస్తామన్నారు. అంటే తక్కిన వారికి మోత తప్పదని మోడీజీ మాట.

రాజకీయ అవినీతిని నిర్మూలించేందుకు ఏవో సంస్కరణలు చేపడతారని ప్రచారం చేశారు గాని ఈ రోజున వుత్తుత్తి విజ్ఞప్తితోనే సరిపెట్టారు.

విదేశాల్లో అక్రమ ఖాతాలను వెల్లడించడం, దేశంలో ఎగవేసిన అప్పులను రాబట్టడం వంటి విషయాaలపై పెదవి మెదిపిందిలేదు.

నోట్ల సరఫరాలో వైఫల్యం, 64 సార్లు రకరకాల ఉత్తర్వుల పిల్లిమొగ్గలు, ఏకపక్షంగానిర్ణయం తీసుకోవడం వల్ల కలిగిన దుష్ఫలితాలు వీటి గురించి మాటమాత్రమైనా వివరణ గాని సవరణ గాని లేనేలేదు.

చివరగా తన చర్య వల్ల నోట్లకోసం క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వందమంది అభాగ్య భారతీయుల కోసం చిన్న కన్నీటి బొట్టు గాని కనీస సంతాపం గాని లేదు.

దేశనాయకుల పేర్లు వల్లెవేయడం బాగానే వుంది గాని వారిలోని మానవీయ కోణం మనకక్కర్లేదా మోడీజీ? వెరీ బ్యాడ్‌.
ఈ నిర్ణయం నచ్చని వారు మిమ్మల్ను ఏదో చేస్తారన్నారు. వారంతా ఆనందంగానే వున్నారు. యాభై రోజుల తర్వాత తప్పని తేలితే ఏ శిక్షయినా వేయమన్నారు. చివరకు కించిత్‌ ఆత్మ విమర్శ, పశ్చాత్తాపం లేకుండా ఈ సంవత్సరాన్ని ఇలాటి విఫల ప్రయోగంతో ముగించడం మీకే చెల్లింది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *