సత్యాలు పట్టని హత్యల పరంపర ‘వంగవీటి’

రాం గోపాల్‌ వర్మను ఆయన చిత్రాలనూ పెద్దగా పట్టించుకోనవసరం లేదని ప్రజలూ రాజకీయ నాయకులూ ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు. లేకుంటే విజయవాడలో రౌడీ రాజకీయాలపై ఆయన తీసిన వంగవీటి ఈ పాటికి మరింత దుమారం రేపి వుండేది. మాజీ ఎంఎల్‌ఎ వంగవీటి రాధా విమర్శలు చేస్తూనే ఇలాటి అభిప్రాయమే వెలిబుచ్చారు.దానిపై వర్మ స్పందనా వచ్చింది. అయితే ఒక దర్ధకుడుగా గాక ప్రత్యర్థి ప్రతిసవాలుగా కనిపిస్తుంది. తను సృష్టించిన ఒక పాత్రను(నిజమైనదే కావచ్చు) గురించి ఒక దర్శకుడు అలా తక్కువగా మాట్లాడ్డం ఇంకా చాలా చూపించొచ్చని బెదిరించడం అసాధారణ పరిణామం. అంటే ఆయన ఈ చిత్రం కేవలం దర్శకుడుగానే గాక ఒక వ్యక్తిగత కోణంలో తీశారని అర్థమవుతుంది. విజయవాడలో రాధా రంగా నెహ్రూ వర్గాల మధ్య ఘర్షణలూ హత్యలూ కొత్తవిషయమేమీ కాదు. వాటి వెనక సామాజిక చారిత్రిక శక్తులనూ వాటి పాత్రనూ విజయవాడ నేపథ్యాన్ని విస్మరించి కేవలం అంతులేని హత్యల పరంపరగానే చూపించడం వర్మ స్వభావానికి అనుగుణమే. శివ, గాయం సినిమాలలోనూ ఇలాటి ఇతివృత్తాలే తీసుకున్న ఆయనకు దశాబ్దాలు గడిచినా కొత్త సంగతులు తట్టకపోవడం భావ దారిద్య్రమే కాదు,చౌకబారు వాణిజ్యధోరణి. వాటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూస్తే తనకు తన వర్మ ఎంత దిగువకు వచ్చాడో కూడా తెలుస్తుంది. చిత్రం మొత్తం వెంటపడి తరుముకుని పొడుచుకోవడం, ఇంట్లో ఆలోచనలు చేసుకోవడం, కుట్రలు పన్నడం భారీ సంగీతం, నేపథ్యగీతాలు, బొంగురు గొంతుతో వర్మ ఎడతెగని వ్యాఖ్యానం మాత్రమే.(రెండుసార్లు మాత్రమే వూరేగింపుల వంటివి చూస్తాం) ఇదంతా తక్కువలో ముగించే తతంగమేనని ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం విజయవాడ బలప్రదర్శనలో భాగమైన దసరా ప్రభలనూ, కార్ల ర్యాలీలనూ, చలివేంద్రాలు వగైరాలను చూపడం మానేశారు. కాపాడింది ఏమంటే సందీప్‌,వంశీలrgv-vangaveeti-movie-review-rating నటన, పట్టుగా సాగే సంగీతం.
ఈ ముఠా యుద్థాల వెనక నేరస్త రాజకీయాలు, ఆసాంఘిక ధోరణులు కులాల కుమ్ములాటలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పాలకపక్షాల పాచికలు కూడా ఎలా పనిచేశాయనేది చెప్పకుండా వర్మ కేవలం వ్యక్తిగత చిత్రణలతోనే సరిపెట్టేశారు. నా వరకు నేనే ఈ చరిత్రనంతా కళ్లారా చూశాను. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదు. కాని వర్మ చరిత్రను అస్సలు పట్టించుకోలేదనడానికి ఒక ఉదాహరణ- ముందు రంగా ఎంఎల్‌ఎ అయినట్టు చూపించి తర్వాత నెహ్రూను ఎంఎల్‌ఎను చేయడం. 1983లోనే నెహ్రూ ఎంఎల్‌ఎ అయితే రంగా 1981లో కార్పొరేటర్‌గా గెలిచి, 1985లో ఎంఎల్‌ఎ అయ్యారు. ఆలస్యంగా ఎన్టీఆర్‌ పాత్రను ప్రవేశపెట్టారంటే చరిత్ర పట్ల ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది.ఇదొక ఉదాహరణ మాత్రమే. రక్తచరిత్రలో సూరి పాత్రలాగే వంగవీటిలో నెహ్రూ పాత్ర పట్ల దర్శకుడు చాలా సానుకూలత చూపించారు. ఇక మురళిని జిఎస్‌రాజు(సిరీస్‌ రాజు) ప్రోత్సహించినట్టు చూపించడం కూడా ఆయనపై విమర్శ రాకుండా చూడ్డానికే కావచ్చు.ఆఖరుకు రంగా హత్య సమయంలోనూ ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఈ కాలంలో కమ్యూనిస్టులు కార్పొరేషన్‌ను కైవశం చేసుకోవడం, నేరస్త శక్తులను దూరం పెట్టడంపై కేంద్రీకరించడం వంటి అంశాలను అసలు పట్టించుకోలేదు.. రాధాను ఆనాటి సిపిఐ నాయకుడ(ఒక ఎర్రజండా పార్టీ అన్నాడుు చలసానిపైకి తెచ్చాడని, తర్వాత అతని చేతుల్లో హత్యకు గురగురయ్యాడని ఆ పైన తనను ఆ పార్టీ వారు చంపేశారని చెప్పడం తప్ప విజయవాడలో దీర్ఘకాలం కొనసాగిన కమ్యూనిస్టుల ప్రాభవాన్ని కాస్తయినా చూపించడం ఆయనకు ఇష్టం లేకపోయింది. చూపిన మేరకు ప్రతికూలతే. వ్యక్తుల పేర్లు కూడా యథాతథంగా వుంచినపుడు దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకోవాలే గాని వూహలకు పరిమితమైతే ఎలా? ఎన్టీఆర్‌ను చూపించారు గాని, మొదటి నుంచి ఈ శక్తులను ప్రోత్సహించిన మరో కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తావించనేలేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ రాజకీయ సామాజిక తరగతుల మనోభావాలను కూడా గమనంలో పెట్టుకుని కథను కథలాగే తీయాలి కదా! ఇంతా చేసి రంగా హత్యను చాలా ముక్తసరిగా చూపించి తదుపరి కల్లోలం మూడు ముక్కల్లో చెప్పేసి ముగించడం విచిత్రం! విజయవాడలో రాధా అనుచరులు దిష్టిబొమ్మలు తగలేయడం, సిపిఐ వారు ప్రకటనలు చేయడం, మల్లాది విష్టు వంటివారి విమర్శలు, ఇంకా ఇతర పరిణామాలు కూడా తత్ఫలితమే. విజయవాడ ఘటనల గుణపాఠమేమిటి ప్రజలపై దాని ప్రభావమేమిటి అన్నది వర్మకు అసలు పట్టని విషయం.
ఒకతరం విజయవాడ వాసులకూ కోస్తా ప్రజలకూ సుపరిచితమైన ఆందోళనకరమైన సమీప గతాన్ని నెమరువేసుకోవడానికి మాత్రమే ఈ చిత్రం పనికివస్తుంది. ఆయా వ్యక్తులకు వున్న ఇమేజిని సొమ్ము చేసుకోవడం తప్ప మరో లక్ష్యం లేని వర్మ వంటివారు వాస్తవ చరిత్ర జోలికిపోకుండా వుండటమే మంచిది. ఇప్పుడు జయలలితపైన, గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌పైన చిత్రాలు తీస్తానంటున్నారు.కాని అవి కూడా ఇంతకంటే మెరుగ్గా వుండే అవకాశం లేదు. తెలుగులో ఇదే తన చివరి సినిమా అని చెప్పిన వర్మ మాటలు నిజమైతే సంతోషించేవారిలో నేనొకణ్ణి. ఎందుకంటే చరిత్రతో చెలగాటమాడటం, ఉద్రిక్త ఘట్టాలను ఆషామాషిగా చూపించడం ఉచితం కాదు. వర్మ సరిగా హౌం వర్క్‌ చేయలేదని చూడగానే తెలిసిపోతుంది. రంగా తన అన్నపై ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించిన చైతన్య రథం, తమ్మారెడ్డి భరద్వాజ తీసిన నేటి దౌర్జన్యం, కూడా ఈ నేపథ్యంలోవే. నేరస్త రాజకీయాలపై టి.కృష్ణ దర్శకత్వంలో రామోజీ రావు తీసిన ప్రతిఘటన పెద్ద సంచలనం సృష్టించింది. వాటిలో దేంతో పోల్చినా ఈ చిత్రం తీసికట్టే. ప్రతిచిత్రంపైన సమీక్షలు రాయడానికి పోటీపడే ప్రముఖ తెలుగు పత్రికలూ వెబ్‌సైట్లు దీనిపై అస్సలు స్పందించకపోవడం కూడా గమనించదగ్గది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *