సభలూ …సందర్భాలూ..

దేశమంతా నోట్లదాడిపైనే చర్చ అట్టుడికిపోతున్నది. నలభై ఏళ్ల పాత్రికేయ జీవితంలో- ప్రత్యేకించి పదేళ్ల టీవీ మీడియా చర్చలలో వరుసగా నెలకు పైబడి ఒకే అంశం నలగడం చూళ్లేదు. . అదలా వుంచితే ముగిసిపోతున్న ఈ ఏడాది డిసెంబర్‌లో వరుసగా అనేక విధాలైన సాహిత్య సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం అనేక ఆలోచనలు రేకెత్తించింది.
గత ఆదివారం డిసెంబర్‌ 11వ తేదీన విజయవాడలో సాహితీ స్రవంతికార్యశాల, స్వేచ్చాస్వరం పేరిట ప్రస్థానం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగాయి. చాలామంది సాహితీ మిత్రులు పెద్దలూ పాల్గొన్నారు. అసహనం, గోరక్షణ,దేశభక్తి జాతీయత వంటి రకరకాల పేర్లతో సాగిన సాగుతున్న దాడుల నుంచి భావ ప్రకటనా స్వేచ్చను ఎలా కాపాడుకోవాలనే దానిపై చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఛానళ్లు పత్రికలపై ఆంక్షల ప్రస్తావన కూడా వచ్చింది. . సుకవి జీవించు ప్రజల నాల్కల మీద అని గుర్రం జాషవా ప్రకటిస్తే పెరుమాల్‌ మురుగన్‌ రచయిత మరణం ప్రకటించాల్సిన పరిస్థితిఎందుకు వచ్చిందని అక్కడ చర్చ జరిగింది. పార్లమెంటులో తనను మాట్లాడనివ్వడం లేదని సాక్షాత్తూప్రధాని మోడీ యుపిలో వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆయన కూడా ఈ వాదనను బలపరిచే పరిస్థితి ఏర్పడిందన్నమాట. చార్వాకులు లోకాయతులతో మొదలు పెట్టి వేమన వీరబ్రహ్మం వరకూ మూఢాచారాలకూ కుల మత వివక్షతలను అనేక విధాల ప్రశ్నించిన దేశంలో ఇంత ఏకపక్ష దాడి దౌర్జన్యం సహించరానివనే భావన వ్యక్తమైంది. దేశభక్తికీ జాతీయతకూ ఎవరికీ గుత్తాధిపత్యం లేవనీ, కుల మత ప్రాంత తేడాల ప్రకారం ఆధిపత్యాలు అసహనాలు చెల్లవనీ వక్తలూ సభికులూ కూడా నొక్కి చెప్పారు అమరావతి నిర్మాణానికి బాహుబలి సెట్టింగ్స్‌ తరహాలో రాజమౌలిని రప్పిస్తామంటున్న పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్‌ వర్తమానాన్నీ ఈ సభ సమీక్షించింది. విచ్చలవిడి భూసేకరణలూ ప్రజల హక్కులపై జరిగే దాడులనూ సహించరాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. ఈ సభ తర్వాత 13వ తేదీన విజయవాడలోనే మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని సీతారాం ఏచూరి ప్రారంభించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరహాలో ఆధునిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలకు వేదికగా ే ఈ భవనం శ్రేయోభిలాషుల సహకారంతో వేగంగా పూర్తవడం విశేషం.
ఇక విజయవాడలోనే 18న మానవతా వాదుల మహాసమ్మేళనం ్ద సభ జరగబోతున్నది. నాస్తికోద్యమ నాయకులు గోరా, లవణం, హేమతల వంటి వారు సంస్కరోణద్యమాలపైన సంస్కర్తలపైన రాసినవి, స్వీయానుభవాలు 14 పుస్తకాలు ప్రజాశక్తి ప్రచురణగా ఆవిష్కరించడంతో పాటు హేతువాదం, బౌద్ధం, అంబేద్కరిజం, మతోన్మాదం ప్రపంచీకరణ తదితర అంశాలపై ప్రసంగాలు చర్చ జరగబోతున్నాయి. భక్తి విశ్వాసాలు వేరు, మూఢ నమ్మకాలు వేరు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ లౌకిక తత్వంతో నిమిత్తం లేని అశాస్త్రీయ పోకడలు వాస్తు విన్యాసాలు అధికారికంగా అమలవుతున్న పరిస్థితులలో ఈ విధమైన చర్చకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. చినజీయర్‌ స్వామి నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూచునే వింతలు, రాజరికాన్ని మించిన యాగక్రతువులూ,అపర్గవాసుదేవుల సన్నిధిలో మరో ముఖ్యమంత్రి నృత్యాభినయాలు చూస్తున్నాం. నేను చూసినంతలో ఆంధ్రజ్యోతి ఆర్కే వంటివారు తప్ప మీడియా ముఖ్యులెవ్వరూ ఇలాటి వాటిపై నేరుగా విమర్శలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో . చరిత్రకారులు సామాజిక వేత్తలూ పాల్గొనే ఈ మానవతా సమ్మేళనం ఆసక్తి కలిగిస్తున్నది. గత ఏడాది సివి సాహిత్యంపైన తర్వాత కాలంలో జాషవా కుసుమ ధర్మన్న సాహిత్యాలపైన జరిగిన బృహత్‌ సమ్మేళనాలు కూడా ఈ కారణంగానే జిజ్ఞాసులను ఆకర్షించాయి.
ఇక హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 17వ తేదీ జరిగే తెలంగాణ సాహితి సాహిత్యోత్సవం(లిటరరీ ఫెస్స్‌ 2016) ప్రస్తావించుకోదగింది. గత పుష్కరకాలంలోనూ విజ్ఞాన కేంద్రం ఇలాటి అనేక సమ్మేళనాలకు వేదికగా వేడుకగా నిలిచింది. సాహిత్య శాల, జన కవనం, కార్యశాల వంటి అనేక ప్రక్రియల్లో అన్ని సామాజిక స్రవంతులకు చెందిన సాహితీ మిత్రులూ పాల్గొంటూ వచ్చారు. మారిన సందర్భంలో విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంసృతిక కేంద్రం, ఐలమ్మ ఆర్ట్‌గ్యాలరీ వంటివి వెలశాయి. ప్రజా సంఘాలు ప్రజా కళాకారులతో కళకళలాడుతున్నది. తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ద్వితీయ సాహిత్యోత్సవం అక్షర ప్రియుల ఆత్మీయ సమ్మేళనం కానుంది. సమరశీల సంప్రదాయాలకు ప్రజా కళలకూ, వాగ్గేయ కారులకూ చిత్రకారులకూ కాణాచి తెలంగాణ సీమలో సాహిత్య కారులు ప్రజల పక్షాల గొంతు సవరించుకుంటారు. రాష్ట్రం వచ్చినంత మాత్రాన రాజకీయంగా పాలకవర్గాలే మాటే శిరోధార్యం కాదని పాడమంటే పాడేది పాటకాదు అన్నట్టు పాలకుల చిలుకపలుకలకే కవులూ కళాకారులూ పరిమితం కాబోరని చాటిచెబుతారు. . ఖమ్మంలో మిత్రులు క్రాంతి శ్రీనివాసరావు భారీ ఎత్తున నిర్వహించే అవార్డులు ఆవిష్కరణల ఉత్సవం కూడా 29నే జరగనుంది.(గత ఏడాది ఇదే వేడుకలో మిత్రుడు అరుణ్‌సాగర్‌ విస్తాపితుల సమస్యపై రాసిన మ్యూజిక్‌ డైస్‌ ఆవిష్కరించాం. తర్వాత కొద్ది రోజులకే తను కన్నుమూయడం ఒక బాధాకర జ్ఞాపకం. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తనపేరిట ఇప్పుడు అవార్డు ఏర్పరచడం అభినందనీయం. అలాగే ఈ వారంలోనే వయోవృద్ధపాత్రికేయులు, తరాల వారధి విహనుమంతరావు కన్నుమూత మరో విచారం. ఆయన ఆదర్శం స్మరణీయం అనుసరణీయం)
మళ్లీసభలకు వస్తే – అనంతపురంలో డిసెంబర్‌ 25న కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలుగులో శ్రామిక జన సాహిత్యంపై జరిగే చర్చా గోష్టి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ అనడానికి ముందే శ్రమములోన పుట్టి సర్వంబు తానౌను అని నిర్వచించిన వాడు వేమన్న. ఆ మాటకొస్తే మహాభారతంలోనే సూచనగా మానవ శ్రమ కనిపిస్తుంది. ఉదంకుడనే రుషి సర్పరాజు తక్షకుడు అపహరించిన కుండలాలను తీసుకువచ్చి గురుపత్నికి ఇవ్వడం కోసం నాగలోకంలోకి వెళతాడు. అక్కడ ఆయన ‘ సితా సితతంతు సంతాన పటంబు ననువయించుచున్న వారినిఇద్దరు స్త్రీలను, ద్వాదశార చక్రంబుం బరివర్తించుచున్న వారి నిర్వురు గుమారుల’ చూస్తాడని ఆదిపర్వం ప్రథమాశ్వాససం వచనం(108)లో చెబుతాడు నన్నయ్య. తెల్లని నల్లని దారాల సముదాయంతో ఇద్దరు స్త్రీలు వస్త్రం నేస్తున్నారట. పండ్రెండు ఆకులు గల చక్రాన్ని ఆరుగురు యువకులు తిప్పుతున్నారట. దీనికి ఈ తెలుపు నలుపు దారాలు ఉదయాస్తమయాలనీ, పండ్రెండు ఆకుల చక్రం కాలగమనమనీ ఆరుగురు యువకులూ రుతువులకు సంకేతాలని అర్థం చెబుతారు. కావచ్చు గాని ఇందులో మానవ శ్రమ వస్త్రాలు నేయడం చక్రం తిప్పడం చిత్రితమవడం గమనించదగ్గది. ‘ఆది’కావ్యం ఆదిపర్వంలోనే ఈ ప్రస్తావన ఆసక్తికరం. ప్రబంధ యుగంలో ప్రణయం పెరిగి అదంతా వెనక్కు పోయినా శతకకారులు మళ్లీ తీసుకొచ్చారు.్త భక్తి కవిత్వం తర్వాత కింది కులాల వారూ స్త్రీలూ కూడా రాయడం మొదలైంది. తర్వాత ప్రజాసాహిత్య యుగంలో ఇదే మార్మోగింది. మళ్లీ ఇప్పుడు పునరుద్దరణ వాదం పుంజుకుని అలాటి వరవడి వెనక్కు పోయి వైయక్తిక అనుభూతులూ ఆధ్యాత్మిక విభూతులూ అధికారిక ఆశ్రయం పొందుతున్నాయి.

ఈ సభలూ సందర్భాలలో సంపాదకులు సాహిత్య జీవులూ సామాజికులూ విస్త్రతంగా పాల్గొన్నారు. నేనూ పాల్గొన్న పాల్గొంటున్న సందర్భాలు చెప్పానే గాని ఇంకా అనేక వేదికల కార్యక్రమాలు విస్మరించడం లేదు. వీటన్నిటికి తారాస్థాయిగా ే హైదరాబాదు బుక్‌ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది.. కోటి దీపొత్సవాలు జరిగిన చోట కోటి పుస్తకోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులన్న మాట గొప్పది. నోట్లపోటును కూడా అధిగమించి అక్షరాభిమానులు జయప్రదం చేస్తారనే నా ప్రగాఢ విశ్వాసం. నమ్మకాల పేరిట కోట్లు వ్యయం చేస్తున్న సర్కారీధీశులు విజ్ఞానం పెంచే పుస్తకాల వికాసానికి మరింత సహకరించాలని కోరుకుందాం. తెలుగు వెలుగులు ఉభయత్రా విస్తరించాలని ఆశిద్దాం ( ఆంధ్రజ్యోతి గమనం, 16.12.16)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *