కంప్యూటర్‌ కళా స్రష్ట – స్టీవ్‌ జాబ్స్‌.

ఉక్రెయిన్‌ విద్యార్థులు కంప్యూటర్‌ కీబోర్డుల బటన్స్‌తో స్టీవ్‌ జాబ్స్‌ చిత్తరువు తయారు చేశారని వార్త చదివాను. అయిదేళ్ల కిందట ఒక టీవీ ఛానల్‌ కోసం నేను రాసిన ఆయన జీవిత కథ గుర్తుకొచ్చింది. అది అప్పట్లో బాగా ఆదరణ పొందింది. నాకూ ఇష్టమైంది. ఈ తాజా కథనంతో పాటు ఆ జీవిత కథనం కూడా ఇక్కడ ఇస్తున్నా. నేను కంప్యూటర్‌ నిపుణుడిని కాకపోయినా వ్యక్తిగా స్టీవ్‌ జాబ్స్‌ కథ ఇచ్చిన ఉత్తేజం అందించాలనే ప్రయత్నం. సాంకేతిక తప్పిదాలుంటే చెప్పొచ్చు. సరిచేసుకుంటా

…………………………………………………

సాంకేతికతను సామాజికతను సమన్వయ పర్చిన మహా మేధావి అతను.
సంగీతాన్ని చిత్రకళనూ నవీన యంత్రంతో మేళవించి కొత్త ప్రపంచాన్నే సృష్టించిన అభినవ బ్రహ్మ అతను.
మహాసంస్థల మారుమూలలకే పరిమితమైన అధునాతన పరికరాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన వైజ్ఞానిక వైతాళికుడతను.
అడుగడుగు గండాల జీవితంలో అవరోధాలన్నిటినీ అధిగమించి సంకల్ప బలంతో సమస్త మానవాళి హృదయాల్లో చోటు సంపాదించుకున్న అసాధారణ ప్రతిభా మూర్తి అతను.
అతనే వుండి వుండక పోతే కంప్యూటర్‌ యుగం అసంపూర్ణమై వుండేది.
అతనే స్టీవ్‌ జాబ్స్‌. కంప్యూటర్‌ మాంత్రికుడే కాదు, లోక బాంధవుడు. మహా దార్శనికుడు. మానవాళి ప్రియ నేస్తం.ఆయన అస్తమయానికి అఖిల ప్రపంచం అశ్రుతర్పణ చేసిందందుకే. కాని అతను స్వల్ప జీవితంలో ప్రతి క్షణం అనల్పమని అర్థం చేసుకుని ఆఖరి శ్వాసలోనూ అపురూపసృష్టి ఆవిష్కరించిన కర్మయోగి. అంతటి అపురూప వ్యక్తి అపర బ్రహ్మ కంప్యూటర్‌ యుగ వైతాళికుడు స్టీవ్‌ జాబ్స్‌
……… ………….
కంప్యూటింగ్‌ అంటే లెక్కలు కట్టడం. వ్యాపారాలు విజ్ఞాన పరిశోధనలు పెరిగే కొద్ది సూక్ష్మాతిసూక్ష్మమైన లెక్కలు, మనుషుల శక్తికి మించిన లెక్కలు కట్టాల్సిన అవసరమేర్పడింది. అందుకోసమే కంప్యూటర్‌ పుట్టింది. మొదటి తరం కంప్యూటర్లు ఒక గది మొత్తం ఆక్రమించేవంటే ఆశ్చర్యం కలగొచ్చు కాని నిజం. అమెరికా వంటి దేశాలలో అది కూడా బహుళ జాతి సంస్థలకే పరిమితమై వుండేవి కంప్యూటర్లు. వాటిని పనిచేయించడం కోసం ఎన్నో మరలూ మీటలూ సాంకేతిక సమస్యలూ.. ఇదంతా అరవయ్యవ దశకం నాటి మాట. ఆ పరిస్తితిని మార్చేసి కంప్యూటర్‌ను ప్రతివారి పరికరంగా ఇంటింటి అలంకారంగా మార్చేసిన ఘనత స్టీవ్‌ జాబ్స్‌ కు దక్కుతుంది.
స్టీవ్‌ జాబ్స్‌ జీవితం పూల పాన్పు కాదు. సమస్యల మయం.1955ఫిబ్రవరి 24న శాన్‌ప్రాన్సిస్కోలో జన్మించాడు. అతను పుట్టింది జోనా కార్లో స్కిబీ అబ్దుల్లా ఫత్‌ జిందాలీ అనే ప్రేమ జంటకు. అయితే వారు అతని ఆలనా పాలనా చూసింది లేదు. దత్తత తీసుకున్న పాల్‌, క్లారా జాబ్స్‌లు అతన్ని పెంచారు.ఇలాటి సందర్బాల్లో సహజంగా వుండే సంఘర్షణలన్ని జాబ్స్‌ చవి చూశాడు. చాలా మంది ప్రసిద్ద వ్యక్తులలాగే జాబ్స్‌ చదువు కూడా సక్రమంగా సాగింది లేదు.కాలేజీ మధ్యలోనే మానేశాడు.
ఆ రోజుల గురించి చెబుతూ-
”నేను ఇష్టపడి ఎంచుకున్న రీడ్‌ కాలేజీ ఫీజులు చాలా ఎక్కువ. నా తలిదండ్రుల ఆదాయమంతా దానికే సరిపోయేది. ఇక నాకేమో ఆ చదువుకు అసలే విలువ లేదనిపించింది.కాలేజీకి వెళ్లడం మానుకున్నాను. ఏవో ఇష్టమైన క్లాసులకు మాత్రం వెళ్లి వినివస్తుండేవాణ్ని.”
ఇదంతా జరిగింది 1972లో.రీడ్‌ కాలేజీ నవ్య భావాలకు నిలయంగా వుండేది. ఇలా చేసినందుకు జాబ్స్‌ ఎప్పుడూ విచారించకపోగా అది తన జీవితంలోనే తెలివైన నిర్ణయమని సంతోషించాడు. కాకపోతే ఆ చిన్న తనంలో మాత్రం చాలా కష్టాలనెదుర్కొన్నాడు.స్నేహితుడి గదిలో వుంటూ నేలమీదే పడుకునే వాడట. కోక్‌ తాగినప్పటికంటే ఆ బ్యాటిళ్లుతిరిగి ఇచ్చి నాలుగు రాళ్లు తీసుకున్నప్పుడు ఎక్కువ సంతోషించేవాడు. ఎందుకంటే అదే అతనికి ఆహారం తెచ్చిపెట్టేది. కొంత ఆరాచకంగానూ బతికాడు గాని పూర్తిగా దారి తప్పిపోలేదు.
చిన్న తనంలోనే సైన్సు పట్ల ఆసక్తి పెంచుకున్న జాబ్స్‌ ద హొల్‌ ఆర్త్‌ క్యాటలాగ్‌ అనే పుస్తకం పట్ల విపరీతంగా ఆకర్షితుడయ్యాడు. అతని తరంలో చాలామందిని అలాగే ప్రభావితం చేసిన ప్రచురణ అది. దాన్ని స్ట్రూట్‌ బ్రాండ్‌ అనే అతను అద్భుతంగా ముద్రించాడు. అప్పటికింకా డిటిపి మొదలు కాలేదు. దాని నాణ్యత సాంకేతిక నైపుణ్యం చూసి పరవశించి పోయాడు జాబ్స్‌. అయితే ఆ పత్రిక కొంత కాలానికి మూసేయాల్సి వచ్చింది. 1975 ప్రాంతంలో చివరి సంచిక వెనక వైపున ఒక రాదారి ఫోటో ముద్రించారట. ఆ ఫోటో కింద వాక్యాలే జాబ్స్‌ను గొప్పగా ప్రేరేపించాయి.
ఆకలితో వుండంది.. మూర్ఖంగా వుండండి.. అంటే మీ పట్టుదల విడవకండి అన్న ఆ సందేశం ఆయన జీవితాంతం మర్చిపోలేదు.
ఆ ఆకలి దశలోనే ఇంటికన్న గుడి పదిలం అన్నట్టు గుళ్లో అయితే వారానికో రోజు మంచి తిండి దొరుకుతుందని పసి గట్టాడు. అది హరేరామ హరే కృష్ణ అంటూ హిప్పీ సంసృతి వూగిపోతున్న తరుణం. హరే కృష్ణ ఆలయం ఏడు కిలోమీటర్ల దూరంలో వుంటే ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లేపెట్టే ఆహారం తిని వచ్చేవాడు.
చదువుకోక పోయినా ప్రతిభావంతుడైన వ్యక్తి మేధస్సు ఖాళీగా కూచోనివ్వదు. అలాగే జాబ్స్‌ కూడా అందంగా అక్షరాలు రాసే కాలిగ్రపీ నేర్చుకోవడం మొదలెట్టాడు. నిజానికి అతనికి దాని అవసరం లేదు, ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు.ఇష్టంగా అనిపించగానే నేర్చేసుకున్నాడు. ఇది తన భావి జీవితంలో ఆపిల్‌ను తీర్చిదిద్దడానికి దోహదకారి అని అప్పటికి అతనికి కూడా తెలియదు. అటారీ అనే విడియో గేమ్స్‌ కంపెనీలో చేరాడు. అప్పుడే అతని దృష్టి హరే కృష్ణ భావానికి పుట్టినిల్లయిన భారత దేశంపైకి మళ్లింది. తన పాఠశాల నేస్తం డాన్‌ కోట్కేతో కలసి ఆధ్యాత్మికానందం అన్వేషిస్తూ ఈ కర్మభూమకి చేరుకున్నాడు.నీమ్‌ కరోలి బాబా అనే బాబాను గురించి విన్న జాబ్స్‌ ఆ బాబాపై ఎందుకో విశ్వాసం పెంచుకున్నాడు. అయితే తీరా వచ్చాక ఆ బాబాను కలిశాడో లేదో గాని అనుకున్నంత తృప్తి పొందలేకపోయాడు. భారత దేశంలో వున్న పవిత్ర పవనాలకు ప్రజల పేదరికానికి పొంతన లేకపోవడం జాబ్స్‌ను కలవరపెట్టింది. నిజం చెప్పాలంటే ఇండియా గురించిన అతని వూహలు పెద్దగా నిలవలేదు.కాకపోతే ప్రపంచాన్ని మార్చాలంటే సాంకేతిక విజ్ఞానం కీలకమన్న భావన తొలిసారి అతనిలో కలిగిందంటారు. అదే అతనిలో అంతర్గర్భితమైన అద్బుత శక్తిని ప్రజ్వరిల్లచేసింది.
అప్పుడప్పుడే కంప్యూటర్‌ గురించిన ఆలోచనలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్పోరేషన్లు పరిశోధనాశాలల పరిధి దాటి వస్తున్నది.ఆ వాతావరణమే అతన్ని అమితంగా ప్రభావితం చేసింది.
తన ఇరవయ్యవ ఏట అంటే 1975లోఇంజనీరు వోజ్నిక్‌తో కలసి స్టీవ్‌ జాబ్స్‌ క్యాలిఫోర్నియాలోని మెన్లో పార్కులో ఒక కంప్యూటర్‌ క్లబ్‌ హాబీగా జరిపే ఇష్టాగోష్టి సమావేశాలకు హాజరవడం మొదలెట్టాడు.అప్పట్లో అతను ఆ సమావేశాల్లో వినిపించే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా విని తీక్షణంగా ఆలోచిస్తూ కనిపించేవాడట. అక్కడకు దగ్గర్లోని లాబరేటరీలో పర్సనల్‌ కంప్యూటర్లపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. కంప్యూటర్‌ గొప్పదే గాని దాన్ని పనిచేయించడం క్లిష్టంగా వుంది. సామాన్య వినియోగదారులకు దాన్ని చేరువ చేయాలంటే సులభతరంగా మార్చాలి. అన్న అభిప్రాయం జాబ్స్‌లో పాతుకు పోయింది.
ఆ సమయంలోనే స్నేహితుడైన వోజ్నిక్‌ ఆపిల్‌ కంప్యూటర్‌ తొలి నమూనా రూపొందించి సన్నిహితులకు మాత్రమే చూపించాడు. చూసీ చూడగానే దీన్ని వాణిజ్య పరంగా విస్త్రతంగా వుత్పత్తి చేసే అవకాశముంది అని గ్రహించాడు జాబ్స్‌. అంతే. ఆ మిత్రులు వెనక్కుతిరిగి చూడలేదు.1976 కల్లా ఎలాగో కాస్త సొమ్ము పోగేసుకుని కేవలం 1300 డాలర్ల పెట్టుబడితో ఆపిల్‌ సంస్థ ప్రారంభించారు. అది కూడా ఎక్కడంటే వారి కారు గ్యారేజీలోనే!
అయితే ఈ మిత్రుల ప్రతిభా పాటవాలను గమనించిన ఎసి మర్కుల్లా అనే వాణిజ్య వేత్త అండగా నిలవడానికి ముందుకొచ్చాడు.అతను అప్పటికే ఇంటెల్‌ సంస్థలో పనిచేసి బయిటకు వచ్చాడు. మర్కుల్లా రెండున్నర లక్షల డాలర్లపెట్టుబడి పెట్టడంతో ఆపిల్‌ సంస్థకు కొత్త వూపు వచ్చింది. ఈ సంస్థకు సాంకేతిక బాధ్యత వోజ్నిక్‌దైతే మార్కెటింగ్‌ బాధ్యత జాబ్స్‌ది. అలా లాస్‌ అల్టోస్‌లో జాబ్స్‌ గ్యారేజీలో మొదలైన ఆ సంస్థ చిన్న కార్యాలయంలోకి మారింది. ఇద్దరు మిత్రులకు కొత్త వుత్సాహం వచ్చింది. రెట్టించిన దీక్షతో ఆపిల్‌కు మెరుగులు దిద్దసాగారు.
అలా అలా 1977 కల్లా ఆపిల్‌ 2 సిద్దమైంది.శాన్‌ ఫ్రాన్సిస్కోలో వెస్ట్‌కోస్ట్‌ కంప్యూటర్‌ ఎగ్జిబిషన్‌లో దాన్ని ఆవిష్కరించారు. ఇంకేముంది? ప్రపంచమంతా పెద్ద సంచలనం! అప్పుడప్పుడే కంప్యూటర్‌ రంగంలో వివిధ సంస్థలు పోటీ పడుతున్నాయి. తమ తమ ప్రత్యేకతలతో ఆకర్షించడానికి తంటాలు పడుతున్నాయి. అలాటి సమయంలో ఆపిల్‌ 2 అటు వ్యాపారప్రపంచాన్ని ఇటు వినియోగదారులను కూడా కుదిపేసింది.
అంతవరకూ వున్న కంపూటర్లు వేరు- ఆపిల్‌ 2 నమూనా వేరు. దీన్ని ఏ అవసరానికి అనుగుణంగానైనా మల్చుకోవచ్చు. అదే దాన్ని తిరుగులేని శక్తిగా చేసింది. ఒక్కసారిగా అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. 1977లో 20 లక్షల డాలర్ల అమ్మకాలు జరిగితే 1981 నాటికి 60 కోట్ల డాలర్లు దాటిపోయాయి. ఆపిల్‌ మహేంద్రజాలం మహీతలాన్ని మంత్రముగ్ధం చేసింది. మరే కంపెనీ కన్నా వేగంగా రెండేళ్లలోనే 1983 నాటికి ఆపిల్‌ 500 ఫార్చూన్‌ కంపెనీల జాబితాలో చేరిపోయింది. దీనంతటి వెనకా జాబ్స్‌ అద్బుత కృషి వుంది. అతను కంప్యూటర్‌ను కేవలం అంకెల యంత్రంగా వున్న కంప్యూటర్‌ను జీవన మంత్రంగా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే దాన్ని సాంకేతిక సాధనంగా గాక జీవిన శైలిగా తీర్చిదిద్దాడు.అసలు అపిల్‌ అన్న పేరు ఎంచుకోవడమే పెద్ద విచిత్రం.
వినియోగదార్లకు దాన్ని చేరువ చేయడం ఎంత ముఖ్యమో కూడా అతనికి తెలుసు. అందుకే పెప్సీ కోలా ప్రధానాధికారిగా పనిచేసిన జాన్‌ స్కల్లీని తమ వైపు తిప్పుకున్నాడు. నీ శేష జీవితమంతా పంచదార నీళ్లే అమ్ముకుంటూ గడిపేస్తావా?లేక ప్రపంచాన్ని మారుస్తావా అని రెచ్చగొట్టాడు. దాంతో స్కల్లీ ఆపిల్‌ సిఇవోగా చేరాడు.అయితే అనుకున్న మేరకు అమ్మకాలు పెరక్కపోవడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితం? తానే నారు వేసి నీరు పోసి పెంచిన ఆపిల్‌ నుంచి 1985లో బయిటకు నడిచాడు జాబ్స్‌. మొదట్లో బాగా చలించి పోయాడు. తన చేతుల మీదుగా పెంచిన సంస్థ నుంచి బయిటకు నడిచినా ప్రేమ అంటే పనిపై ప్రేమ పోలేదన్నాడు.
.డైరెక్టర్‌ జార్జిలూకాస్‌ నుంచి ఒక చిన్న గ్రాఫిక్స్‌ కంపెనీని తీసుకుని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కొంతమంది సైంటిస్టులు, చిత్రకారులు,యానిమేటర్ల బృందాన్ని ఏర్పాటుచేసుకుని పిక్సార్‌ యానిమేషన్‌ స్టుడియోగా మార్చాడు. అక్కడే 1995లో టారుస్టోరీతో మొదలు పెట్టి సాంకేతిక నైపుణ్యంతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించాడు. వాటికి అస్కార్‌ బహుమానాలు అనేక సార్లు వచ్చాయి. జాబ్స్‌లో కళాకారుడు సాంకేతిక నిపుణుడు సహజీవనం చేయడమే ఇందుకు కారణం.ఇంతా చేసి ఆయన హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ కాదు.సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ కూడా కాదు. కనీసం మేనేజర్‌లా కూడా వ్యవహరించడు. సాంకేతిక బృందానికి నాయకుడుగా మాత్రమే వుంటాడు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించి చివరగా తను కలులు గన్న మహత్తర పరికరాన్ని సృషిస్తాడు. ఆ విధంగానే నెక్స్ట్‌ అనే కొత్త కంప్యూటర్‌ సంస్థను నెలకొల్పాడు.
స్టీవ్‌ జాబ్స్‌ లేని ఆపిల్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది.కొత్తతరం కంప్యూటర్లను సృష్టించలేక ఆపిల్‌ అధిపతిగా వున్న గిల్‌బ్రెట్‌ ఆమేలీ నెక్ట్స్‌ సంస్థను భారీ విలువతో కొని లీనం చేసుకున్నాడు. ఆ విధంగా మళ్లీ మాతృసంస్థలో అడుగుపెట్టాడు జాబ్స్‌. 2000 నాటికి మళ్లీ సిఇవో పగ్గాలు చేపట్టాడు.
నిరంతర సాంకేతిక తపస్వి అయిన జాబ్స్‌ దృష్టి ఇప్పుడు ఐపాడ్స్‌ పై పడింది. కంప్యూటర్లతో సంగీత సాహిత్యాలు దెబ్బ తినిపోయాయని చాలా మంది అంటున్నారు. దానికి తోడు యువతలో సంగీతాభిరుచిని అందుకోవలసిన అవసరమూ వుంది. పాత సాధనాలు ఇప్పుడు అక్కరకు రావడం లేదు. ఈ తపనలోంచి సృష్టించిందే మొదట ఐ ట్యూన్స్‌, తర్వాత ఐపాడ్‌ ఎంపి 3. ఇదెంత వేగంగా వ్యాపించిందంటే కంపెనీ ఆదాయంలో సగానికి పైగా ఆర్జించి పెట్టేంత. మరోవైపున సంగీత ప్రియులకు గొప్ప సంతృప్తి.
అయితే ఇలాటి సంతోష తరుణంలోనే స్టీవ్‌ జాబ్స్‌కు ప్రాణాంతకమైన పాంక్రియాస్‌ కాన్సర్‌ సోకింది.2004లో స్కానింగ్‌ చేయించుకున్నప్పుడు ఈ వ్యాధి వున్నట్టు తెలిసింది. అయితే ఆయనకు శస్త్ర చికిత్స జయప్రదమైందని ఆపిల్‌ సంస్థ ప్రకటించింది.కాని వాస్తవం వేరు. చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఇంటికి వెళ్లిచేయాల్సిన పనులన్ని చేసుకొమ్మన్నాడట. దాంతో తనకు విషయం అర్థమై పోయిందని జాబ్స్‌ తర్వాత చెప్పాడు.కాని ఎంత మాత్రం తలకిందులై పోలేదు. ప్రతిరోజూ మీ జీవితంలో చివరి రోజు అనుకున్నట్టే జీవించగలిగితే సరిగ్గా పనిచేసినట్టు అని విద్యార్థులతో అన్నాడు.ఎవరూ చనిపోవాలని కోరుకోరు గాని మరణం తప్పదు. జనన మరణాల వల్లనే ప్రపంచంలో కొత్త రక్తం వస్తుంటుంది. మీ జీవితంలో ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి అని 2005లో స్టాండ్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేసిన ఆర్ద్రమైనప్రసంగంలో చెప్పాడు.
నిజంగానే ఆయన వూరుకోలేదు. విప్లవాత్మకమైన ఐ ఫోన్‌ తయారీకి అంకితమైనాడు. 2007లో దాన్ని విడుదల చేసినప్పుడే అతను చాలా దుర్బలంగా కనిపించడం అందరూ గమనించారు. ఆ వెంటనే ఆపిల్‌ షేర్ల విలువ పడిపోయిందంటే అతని సత్తా తెలుస్తుంది. కోట్లలో ఐఫోన్లు అమ్మడం ద్వారా ఆపిల్‌ ప్రపంచ మార్కెట్లో ఒక శాతం తనే నమోదు చేసుకుంది. ఆ విధంగా స్టీవ్‌ జాబ్స్‌ స్వప్నం సాకారమైంది.
సాంకేతిక స్రష్టగా ప్రపంచం కీర్తించినా స్టీవ్‌ జాబ్స్‌ కేవలం పరికరాలతోనే ప్రపంచం మారిపోతుందని భావించడు. అలాటి భ్రమలు తనకు లేవని స్పష్టంగా చెబుతాడు.సామాజిక మార్పుల అవసరాన్ని పదే పదే చెబుతుంటాడు. అలాగే మనిషి యంత్రం కాదు గనకే సంగీతం చిత్రకళ వంటి అన్ని సాంకేతిక చట్రంలో చోటుండాలని గట్టిగా నమ్మాడు. ఆ విధంగానే మానవ జాతికి కొత్త సృష్టిని తలపించే కంప్యూటర్‌ జగతిని సృష్టించి నిష్క్రమించాడు. 2011 అక్టోబరు 6 వ తేదీన ఆయన ప్రశాంతంగా మరణించాడని కుటుంబ సభ్యులు ప్రకటించారు. భార్య లారన్‌ పావెల్‌, కుమార్తెలు ఈవ్‌, ఎరిన్‌, సియన్నా, కుమారుడు లీసా బ్రెన్నెన్‌ జాబ్స్‌ ఎంతో హుందాగా వ్యవహరించి ఆయన సమున్నత వారసత్వాన్ని నిలబెట్టారు. దేశాధినేతలు, మేధావులు, విజ్ఞాన వేత్తలు, పారిశ్రామికాధిపతులు కోట్లాది మంది కంప్యూటర్‌ వినియోగదార్లు ఆయన అద్బుత కృషికి అశ్రుతర్పణ చేశారు.
కంప్యూటర్‌ మౌస్‌ను పట్టుకున్న ప్రతిసారీ, టచ్‌ చేసిన ప్రతిసారీ, ఈ మెయిల్‌ అందుకున్న ఐప్యాడ్‌లో పాటలు విన్న ప్రతివారి హృదయ నాదంలోనూ స్టీవ్‌ జాబ్స్‌ చిరంజీవిగా వుంటాడు. భవిష్యత్‌ పరిశోధకులకు సాంకేతిక నిపుణులకు ప్రేరణ అవుతాడు.

Facebook Comments

One thought on “కంప్యూటర్‌ కళా స్రష్ట – స్టీవ్‌ జాబ్స్‌.

  • November 28, 2016 at 12:31 pm
    Permalink

    ప్రతివారి హృదయ నాదంలోనూ స్టీవ్‌ జాబ్స్‌ చిరంజీవిగా వుంటాడు.RIP TO స్టీవ్‌ జాబ్స్‌.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *