నారాయణ- నారాయణ … నిజమిదే నాయనా!

సిపిఐ నాయకులు కె.నారాయణ సతీసమేతంగా ఇటీవల తిరుపతి వెంకన్నను కొణిపాకం వినాయకుణ్ని సందర్శించడం మీడియాలో ఒక వార్తా కథనంగా వచ్చింది. భార్య కోర్కె మేరకు తాను యాభై ఏళ్ల తర్వాత ఏడుకొండల వాడి గుడికి వచ్చానని చెప్పారు. దేవుడనేవాడుంటే అన్యాయాలు అరికట్టాలని కోరినట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు( ఇవన్నీ మీడియాలో చూసినవి మాత్రమే. ఆయన ఏదైనా వివరణ ఇస్తే తప్ప) ఈ వార్తాకథనంలో రెండు కోణాలు కూడా అపోహలకు దారితీసే అవకాశముంది. మొదటిది కమ్యూనిస్టులంటేనే దేవుణ్ని పూజలను వ్యతిరేకిస్తారని. రెండవది – నారాయణ మారిపోయారని. ఇందులో రెండవదానికి ఆయన మాత్రమే సమాధానమివ్వాల్సి వుంటుంది. మొదటిది మాత్రం తీసుకుంటే భౌతికవాద విజ్ఞానం వంటపట్టిన తర్వాత అతీత శక్తులూ ఆధ్మాత్మిక తతంగాలపై దానికనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ మాటకొస్తే కమ్యూనిస్టులు కానివారిలోనూ చాలా మంది హేతువాదులు నిరీశ్వరవాదులు వున్నారు. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు, నాస్తిక కేంద్రం వ్యవస్థాపకులైన గోరా. తనదైన తాత్వికత బోధించిన జిడ్డు కృష్ణమూర్తి. ఈ తరంలో కెసిఆర్‌ చాలా యజ్ఞయాగాలు చేస్తున్నా ఆయన కుమారుడైన కెటిఆర్‌కు అంతగా ఈ నమ్మకాలు వుండవని, మై కప్‌ ఆఫ్‌ టీ కాదంటారని చెబుతుంటారు. ఒకసారి టీవీ చర్చలో నేనేదో పురాణాల ప్రస్తావన చేస్తే కమ్యూనిస్టులకు ఇవన్నీ ఎప్పటినుంచి పట్టుబడ్డాయని ఆయన సరదాగా దాడి చేశారు. నిజానికి పురాణాలు కావ్యాలు చాలా ఇష్టంగా చదివాను. ఎన్టీఆర్‌ పౌరాణికాలు దాదాపు కంఠోపాఠం. వాస్తవంలో అపర కృష్ణావతారం అనిపించుకున్న ఎన్టీఆర్‌ కూడా శ్రుతిమించిన మూఢత్వం ప్రదర్శించింది లేదు. పైగా బూటకపు బాబాలను ఎండగట్టేందుకు కోడలు దిద్దిన కాపరంలో సచ్చిదానంద స్వామిని సృష్టించారు. ఓం సచ్చితానంద ఈ సర్వం గోవింద అన్న పాట బాగా పాపులర్‌.
విషయమేమంటే కమ్యూనిస్టులెప్పుడూ ప్రజల విశ్వాసాలను పూజలను కించపర్చరు సరికదా గౌరవిస్తారు. భారత దేశంలో కమ్యూనిస్టు అగ్రనాయకులైన ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతిబాసుల జీవిత చరిత్రలు చదివితే కుటుంబ సభ్యులు భార్యా పిల్లల కోసం వారు ఆలయాలకు వరకూ వెళ్లడం, లేదా ఇంట్లొ జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తాం. వారు అందులో పాల్గొనడం కాదు గాని కుటుంబసభ్యులను సమాజంలో ప్రజలను గౌరవిస్తారు. 30 ఏళ్లకు పైగా సాగిన బెంగాల్‌ పాలనలో దుర్గాపూజా వేడుకలు ఘనంగానే కొనసాగాయి. కేరళలో ఓనం సంబరాలూ తెలిసినవే.పల్లెపట్టులో తిరుణాళ్ల నుంచి అనేక సందర్భాల్లో యువజన సంఘాలు పాలుపంచుకుంటాయి. విచిత్ర వేషాలు సభలూ జరుగుతాయి. మూఢనమ్మకాలు మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించడం వేరు, కోట్లమంది విశ్వాసాలను గౌరవించడం వేరు. ఇప్పుడు సమాజంలో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులే మూఢ నమ్మకాలను స్వాములు సన్యాసులను నెత్తిన పెట్టుకోవడం రాజ్యాంగ సూత్రాలకు రాజకీయ లౌకిక సూత్రాలకు విరుద్ధం గనకనే అందరూ విమర్శిస్తారు. దానికి కమ్యూనిజానికి కూడా సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేనైతే ఏదైనా వూళ్లో ప్రాచీన ఆలయం లేదా ప్రార్థనాస్థలం( ఏమతమైనా) వుంటే చరిత్ర శిల్పాల కోసం తప్పక చూస్తాను. గత ఏడాది కాశీ ప్రయాగ చూశాను. ఇటీవలనే కీసరగుట్ట కూడా వెళ్లాను. అయితే వెళ్లిన చోట పూజలేమీ చేసింది లేదు. 1972లో సిపిఎం మహాసభలు మదురైలో జరిగినపుడు ప్రతినిధులు మీనాక్షి ఆలయం చూడటానికి వెళితే పెద్ద ప్రచారమే నడిచింది. ఇదంతా కూడా అవగాహనా రాహిత్యం అనుకోవచ్చు. ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలోనూ లేదా ప్రకటనలు ప్రసంగాల్లోనూ నాస్తికత్వం వుండదు. అలాగని భక్తిపారవశ్యమూ మతాన్నివాడుకోవడమూ కూడా జరగదు.నారాయణ ఏం చేశారో తెలియదు.బహుశా మీడియా మిత్రులు గనక ముందో వెనకో ఆయనే వివరిస్తారనుకుంటాను. ఎందుకంటే అపోహలు వస్తే తొలగించవలసింది ఆయనే. బాధ్యతగా నివేదించవలసింది మీడియానే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *