ట్రంప్‌ విజయం- గ్లోబల్‌ స్వప్నభంగం -ఎకనామిస్ట్‌

not-my111trump-obamaఅమెరికా నూతన అద్యక్షుడుగా ఎన్నికైనడోనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ ప్రస్తుత అద్యక్షుడు బారక్‌ ఒబామాను శ్వేతసౌధంలో కలుసుకున్నారు. . దాంతోపాటే ఎన్నికల ప్రచారంలో తాను ప్రకటించిన ఆందోళనకరమైన కొన్ని అంశాలను ఆచరణలో ఎలా అమలు చేయాలో మంతనాలు ప్రారంభించారు. విజయోత్సవ సభలో మన మహత్తర అమెరికాను మరింత మహత్తరంగా చేద్దామన్న ట్రంప్‌ మాటలు నిజానికి అద్యక్షులైన వారంతా చెబుతూనే వచ్చారు. మనతో వచ్చేవారందరినీ తీసుకుపోతాం, లేదంటే మన పని మనం చేస్తాం అన్నట్టు మాట్లాడారు. .అమెరికాను ఎవరు పాలించినా అమెరికా ప్రపంచాన్ని పాలించాలి అనేది ఆ దేశాధినేతలు తరచూ ఉపయోగించే అహంభావ పదజాలం. అమెరికాలో రిపబ్లికన్లు డెమోక్రాట్టు ఎవరు పాలించినా విదేశాంగ విధానంలో స్వల్ప తేడాలు తప్ప పెద్ద మార్పులు వుండవు. కొందరు అనేట్లు ఒకరు ఉదారవాదులు ఒకరు మాత్రమే మితవాదులు అనడానికి ఆధారమేమీ లేదు. . ఆ దేశాన్ని నడిపించే బలమైన సైనిక పారిశ్రామిక వ్యవస్థ నిర్దేశం తప్పిస్తే ట్రంప్‌ మాటలను బట్టి జరిగేది పెద్దగావుండదు.
కూలిన బెర్లిన్‌ స్వప్నం
ట్రంప్‌ విజయాన్ని కొంతమంది ఈ ఎన్నికను రెండవ బ్రెగ్జిట్‌తో పోల్చారు. అంటే ప్రపంచీకరణ క్రమం వెనక్కుమళ్లడానికి అది ఆరంభమైతే ఇది కొనసాగింపని వారి ఉద్దేశం. ఎకనామిస్ట్‌ పత్రిక దీనిపై రాస్తూ 1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేతతో మరోసారి అమెరికా శకం ఆరంభమైందని, కమ్యూనిజంపై క్యాపిటలిజం శాశ్వత విజయం సాధించిందన్న అంచనాలను ట్రంప్‌ విజయం ఆఖరిదెబ్బ కొట్టిందని వ్యాఖ్యానించింది. ఈ కాలంలో ఆర్థిక పరిణామాలు సమాజంలో కింది వర్గాలలోఎంత ఆగ్రహానికి ఆవేదనకూ దారితీశాయో జాతి వైరం ఎంతగా పెంచాయో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. విదేశాంగ విధాన సమస్యలలో ట్రంప్‌ వీటిని ఎలా అమలు చేస్తారో చూడాలని పేర్కొంది. ఇక విద్వేషభావన ప్రత్యర్థులపై దాడి వంటివి అధికారం చేపట్టిన తర్వాత ఆయన సవరించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చుతూ అద్యక్షుడు ఇష్టానుసారం వ్యవహరించకుండా చేయగల కట్టుదిట్టాలు అమెరికా రాజ్యాంగంలోనూ వ్యవస్థలలోనూ వున్నాయని స్పష్టం చేసింది. వైట్‌హౌస్‌ సందర్శన తర్వాత ట్రంప్‌ ఒబామా ఆరోగ్యరక్షణ పథకం కొన్ని సవరణలతో కొనసాగించవచ్చునని ్‌ సూచనగాచెబుతున్నారు.
హిల్లరీపై అంచనాలు వాస్తవాలు
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ్‌ ట్రంప్‌ ఎన్నికవడం అంచనాలను తలకిందులు చేసిందనే మాట చాలా మంది వ్యాఖ్యాతలు మీడియా సంస్థలనుంచి వచ్చింది. అసలిది మీడియా విశ్వసనీయతకే సవాలు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన ఆలోచనలూ అభిభాషణలూ వికృతంగా విద్వేషపూరితంగా వున్నా ప్రస్తుత అమెరికా సమాజ నేపథ్యంలో ఆయన విజయం సాధించవచ్చనే అంచనాలూ కూడా వున్నాయి. అమెరికా కార్పొరేట్‌ మీడియా శక్తులు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలిస్తే సురక్షితమని భావించడంతో ఆమెకే అధిక ప్రచారం ఇచ్చారు. మన కార్పొరేట్‌ మీడియా కూడా అదే అనుసరించింది. 72 అమెరికా పత్రికల్లో ఒక్కటి మాత్రమే ట్రంప్‌ను బలపర్చింది. సీనియర్‌ బుష్‌ ఎనిమిదేళ్లు పాలిస్తే తర్వాత బిల్‌క్లింటన్‌ మరో ఎనిమిదేళ్లు ఏలారు. అప్పుడు జూనియర్‌ బుష్‌ వచ్చి మరో ఎనిమిదేళ్లు పాలన చేశారు. ఆ తర్వాత నల్లజాతి తొలి అద్యక్షుడనే ముద్రతో బారక్‌ ఒబామా ఎనిమిదేళ్లు పాలన చేశారు. ఆయనతో అభ్యర్థిత్వంకోసం పోటీ పడిన హిల్లరీ క్లింటన్‌ను విదేశాంగ మంత్రిగా ఒక కీలక బాధ్యత అప్పగించారు. తర్వాత సెనేటర్‌గా కొనసాగారు. ఇప్పుడు ఆమె గెలవడం ద్వారా గత ముప్పైఏళ్ల పాలనా వ్యవస్థను యథాతథంగా సాగించుకోవచ్చని అమెరికాలోని ఆధిపత్య వర్గాలు భావించాయి. ాఅయితే హిల్లరీని ఇన్నేళ్ల్ల అమెరికా అధికార వ్యవస్థలో భాగంగానే ఓటర్లు పరిగణించారు. ట్రంప్‌ అసహ్యంగా మాట్లాడినా ఆయనను వ్యవస్థకు బయిటివ్యక్తిగాా పరిగణించారు. ఇలా జరగాలనే ఆయన. అంతకంతకూ వెకిలిగా దూకుడుగా ప్రవర్తించారు. అక్రమ వలస దార్లను నిలిపేస్తానని ముస్లిములకు వీసాలు నిరాకరిస్తామని, ఔట్‌ సోర్సింగ్‌ ఆపేస్తామనీ, నాటోతో సహా బయిటదేశాల భారం తగ్గిస్తామని ఏవేవో వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితిలో ఇవి ఆకట్టుకున్నాయి. పైగా డెమొక్రటిక్‌ పార్టీ ప్రచారం యావత్తూ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అశ్లీలత వంటి వాటిపై నడిచింది. ఒక వేళ ఆయన చాలా సున్నితంగా మాట్లాడివున్నా సారాంశంలో తేడా వుండేది కాదు. (నిజానికి నేను సెప్టెంబరు 27న తెలకలపల్లి రవి.కామ్‌లో తొలిచర్చలోనే ట్రంప్‌ పైచేయి అని రాసింది చూడొచ్చు. కొంతమంది మిత్రులు ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన తర్వాత వారికోసం మరికొంత కలిపాను.)
తేడాలేని విధానాలు
నిజానికి విదేశాంగ విధానం, అమెరికా ప్రయోజనాల రక్షణ, కార్పొరేట్‌ అనుకూలత, కార్మికులపై వేటు వంటి విషయాల్లో ఉభయులవీ కుడి ఎడమ విధానాలే. ఉభయులూ కలిసి మూడో శక్తికి అవకాశం లేకుండా చేస్తారుమూడో అభ్యర్థిగా వచ్చిన బిన్నీ శాండర్స్‌ కొన్ని మౌలిక సమస్యలు లేవనెత్తి తన స్థానం స్థిరపర్చుకున్నాడు.కాని ఆయనపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. శాందర్స్‌ గనక పోటీలో వుండి వుంటే చర్చ మరో విధంగా నడిచేది.( ఓటమి తర్వాత ఆయన ఒక ప్రకటన చేస్తూ డెమోక్రటిక్‌ పార్టీ ఇప్పటికైనా తన ఉదార వాద ముద్రను కాపాడుకోవాలంటే శ్రమజీవులు సామాన్యులకు దగ్గర కావాలని సూచించారు. ఈ భావాలు నచ్చకే ఆధిపత్య వర్గాలు శాండర్స్‌ను వెనక్కు నెట్టి హిల్లరీనే నిలబెట్టారు.) అలాకానప్పుడు ట్రంప్‌ను కాదని హిల్లరీని ఎన్నుకోవలసిన తేడాలేమీ ఓటర్లకు కనిపించలేదు. ఇద్దరిలో ఎవరూ మాకు ఇష్టంలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో ప్రతిపదిమంది ఓటర్లలోనూ ఎనిమిది మంది చెప్పారట. పైగా 145 ఏళ్ల అమెరికా చరిత్రలోనూ రెండవ ప్రపంచ యుద్ధానంతరం రూజ్‌వెల్ట్‌ను తప్పిస్తే డెమోక్రటిక్‌ పార్టీ వరుసగా మూడోసారి గెలిచింది లేదు. హిల్లరీపైన వున్న ఆరోపణలను కూడా దృష్టిలో వుంచుకుంటే ఆమె ఓటమికి అవకాశం చాలా వున్నా మీడియా దాటవేసింది. చివరకు ఇప్పుడు ఫలితం వేరే వచ్చిందంటున్నారు. నిజానికి ఇది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్గతికి ప్రతిబింబం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *