చంద్రబాబుకు మోడీ ఆనందభంగం

jagan-modi-babu

దేనికైనా ఘనత ఆపాదించుకునేముందు ఒకింత సహనం , మరింత నిబ్బరం అవసరం. అందులోనూ ప్రజలను ప్రభుత్వాలను నడిపించే నాయకులకు అనుభవజ్ఞులకు మరింత అవసరం. ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్ల సర్జికల్‌ స్ట్రయిక్‌ ఫలితాలపై సామాన్యులు కూడా సందేహాలు వెలిబుచ్చుతుంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఇది తన లేఖ ప్రభావానికి మచ్చుతునకగా చెప్పుకోవడానికి హడావుడి పడ్డారు. అంతేగాని పూర్వాపరాలు పర్యవసానాలు చూద్దామని కాస్తయినా నిరీక్షించలేకపోయారు. ఇప్పుడు జరిగిందేమిటి?
మొదటి విషయం- అసలు జరిగింది పెద్ద నోట్ల రద్దు కానేకాదు. కొత్త నోట్ల ముద్రణ మాత్రమే.
రెండవది- పెద్ద నోట్లు రద్దు చేయకపోగా మరింత పెద్ద నోటు ప్రవేశపెట్టారు. అది ఎందుకో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు గాని అవతలి వారి ఆలోచనే అది.
మూడవది- నిర్మాణాత్మక సన్నాహాలు లేకుండా ఈ నాటకీయ నిర్ణయం ప్రకటించడం వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని కాస్తయినా పరిగణనలోకి తీసుకోలేదు.
నాల్గవది- ప్రతిపక్షనేత జగన్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని లేఖ రాసినా- చంద్రబాబుకు ముందే తెలుసనే విమర్శను కూడా ఎదుర్కోకతప్పని స్థితి. అస్మదీయులు ముందే సర్దుకోవడానికి, భూములు వగైరా కొనుగోళ్లు చేసి దాచుకోవడానికి ప్రభుత్వం సహకరించిందనే ఆరోపణలు కూడా మోయవలసిన పరిస్థితి!
అయిదు- ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం ధనం సమకూర్చడంలో తెలుగుదేశం అధినేతకే పెద్ద పేరుంది. అది కూడా చాలా పథకం ప్రకారం జరుగుతుందని ప్రతీతి. కాబట్టి ఈ విషయంలో బీద అరుపులు ఎవరూ వినే అవకాశం వుండదు.
ఆరు- ఈ తొందరపాటు ఆనందంతో చంద్రబాబు కేంద్రంలో తనకు పెద్దగా మాట లేదని తానే నిరూపించుకున్నట్టయింది.
ఏడు- అంతమంది మేధావులను సలహాదారులుగా పెట్టుకున్నా బాలయ్య బాబు డైలాగులాగా ఒకవైపే చూపిస్తున్నారు తప్ప రెండో వైపు చూడటం లేదనీ చూడనివ్వడం లేదనీ కూడా అర్థమై పోయింది.
పెద్దనోట్లపై పెద్దాయన కోరితెచ్చుకున్న ఆనందభంగం కాక ఇది మరేమిటి?
చంద్రబాబు సంగతి అలా వుంచి పొంగిపోయిన మీడియా కూడా వెనక్కు తిరిగిచూసుకోవలసిన స్థితి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *