నోబెల్‌ అయినా ‘నో కేర్‌’.. పీపుల్స్‌ కంపోజర్‌

బాబ్‌డిలాన్‌కు ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ ప్రకటించడం ప్రజాకళలకు ప్రపంచాభిషేకం లాటిది. నోబెల్‌ పురస్కారం వెనక రాజకీయాలు సామ్రాజ్యవాద రాజకీయాలు వుండే మాట నిజమే. కాని సాహిత్య రంగంలో మాత్రం ఎక్కువ భాగం వామపక్ష భావాలు గల రచయితలను లేదా ప్రగతిశీల ధిక్కార స్వరాలను ఎంచుకోక తప్పడం లేదు. ఈ కోవలో చూసినా బాబ్‌ డిలాన్‌ వంటి ప్రజా కళాకారుడికి తిరుగుబాటు స్వరానికి మన్నన దొరికింది. దీనిపై తెలుగు పత్రికల్లోనూ చాలా సమాచారం వచ్చింది. రష్కిన్‌బాండ్‌ వంటి రచయితలు ఆయనకు ఎలా సాహిత్య పురస్కారం ఇస్తారని ఆక్షేపించడం నిజానికి ఒక వర్గం కులీన రచయితల ఆగ్రహావేశాల ప్రతిధ్వని మాత్రమే. ఇంతా చేసి బాబ్‌ ఈ పురస్కారాన్ని పూచిక పుల్ల జమ కట్టడం ఈ కథలో కొసమెరుపు మాత్రమే కాదు, ఒక ధిక్కార స్వరానికి తగిన మలుపు. నిజానికి అవార్డు సమాచారం అధికారికంగా తెలియజేద్దామని పురస్కార ప్రదాత అయిన స్వీడిష్‌ అకాడమీ ఎంతగా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత ఆయన వెబ్‌సైట్‌లో నోబెల్‌ ప్రకటించిన విషయం పొందుపర్చారు.దాంతో కమిటీ వారు ఇతరులూ కూడా హమ్మయ్య అనుకున్నారు. కాని మూడు రోజులు కాకుండానే డిలాన్‌ ఆ వాక్యాన్ని తొలగించారుdylon222. ఇది ఆయనను ఎంపిక చేసిన వారిని అగౌరవ పర్చడమేనని నోబెల్‌ ఎంపికకమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది గాని ఆయన అస్సలు పట్టించుకోలేదు! . గే ఒకసారి ప్రకటించిన తర్వాత తిరస్కరించే అవకాశమూ వుండదు.అంటే ఒకవేళ బహుమతి ప్రకటించబడిన వ్యక్తి వద్దని చెప్పినా స్వీడిష్‌ నోబెల్‌ అకాడమీ పరిగణనలోకి తీసుకోదు.. గతంలోనూ ఫ్రెంచి అస్తిత్వవాద తాత్వికుడు జీన్‌పాల్‌ సార్త్‌ మరో నలుగురు తనకు వచ్చిన నోబెల్‌ను తృణీకరించారు. బాబ్‌ డిలాన్‌ కూడా పురస్కార స్వీకారానికి వెళ్లరనే అనుకుంటున్నారు. వెళ్లి సాహిత్యంపై ఒక ఉపన్యాసం చేస్తే తొమ్మిది లక్షల డాలర్లు ఇస్తారు. లేదంటే లేదు. దానికి పురస్కారానికి సంబంధం వుందని కమిటీ విధానం.
అంతర్జాతీయంగా ఆంగ్లంలో ఒక నాజర్‌, ఒక గద్దర్‌ అనదగిన బాబ్‌ డిలాన్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నల్లజాతి హక్కుల పోరాటానికి సంఘీభావం ప్రకటించిన వ్యక్తి వియత్నాం యుద్దంతో సహా సామ్రాజ్యవాదంపై సమరం సాగించిన వ్యక్తి కావడం గర్వకారణం. పదవులు పురస్కారాలు సత్కారాల కోసం పాకులాడే కళా జగతిలో అత్యున్నతమైనదిగా చెప్పబడే నోబెల్‌నే తృణప్రాయంగా చూడటం ఆయన చైతన్యానికి ఔన్నత్యానికి సంకేతం. ప్రభుత్వ పదవులకోసం ప్రాపకాలు కోసం దండగమారి బిరుదుల కోసం పాకులాడే మన కవులు కళాకారులు రచయితలు ఆయననుంచి కాస్తయినా నేర్చుకుంటారా? ఒక ధిక్కార స్వరానికి నోబెల్‌ ఇచ్చి బుజ్జగించాలనుకుంటే దాన్ని మాత్రం ధిక్కరించకుండా వుంటుందా?

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *