మన సంస్థలు గాడిదలు, సింగపూర్‌వి గుర్రాలట!

high-court-of-telangana
అమరావతి స్టార్టప్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి స్విస్‌ చాలెంజి పద్ధతిని సవాలు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ విపరీత వ్యాఖ్యలు చేశారు. భారతీయ నిర్మాణ సంస్థలను గాడిదలతో పోలుస్తున్నట్టుగా ‘మాకు పరుగెత్తే గుర్రాలే కావాలి, గాడిదలు వద్దు ‘ అని నోరు పారేసుకున్నారు. గతంలో సింగిల్‌ జడ్జి ఎస్‌.రామచంద్రరావు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా మళ్లీ హైకోర్టులోనే తేల్చుకోమని వారు వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ద్విసభ్య బెంచి విచారణ జరుపుతున్నది. ఎజిశ్రీనివాస్‌ పై విధంగా అనగానే దుర్గాప్రసాదరావు గాడిదలే బాగా పనిచేస్తాయి,పైగా కష్టపడిపనిచేస్తాయి.బరువులు మోస్తాయి అని నవ్వుతూ చురక వేశారు. అయినా సరే గుర్రాలే కావాలి గాని గాడిదలు వద్దని ఎజి మళ్లీ అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన వాళ్లు కట్టేవి మురికివాడల్లా వుంటాయని అన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఎజి మరో అడుగు ముందుకేసి గాడిదలతో పోల్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలో చిత్రమైనమార్పు చేసింది. రాజధాని భవనాల నిర్మాణం, అభివృద్ధి మాత్రమే గాక ఉద్యోగాల కల్పన, కమర్షియల్‌ స్పేస్‌ మార్కెటింగ్‌ ముఖ్యమని వాదించింది. ఈ పనిచేయాలంటే విదేశీ కంపెనీలే కావాలి గాని మన వాళ్లు చేయలేరని ఎజి అభిప్రాయం వెలిబుచ్చారు. మరి హైదరాబాదులో ఐటి కంపెనీల విస్తరణకు దేశీయ సంస్థలే కారణం కదా అని కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే ఇందుకోసం కాంట్రాక్టరు ఎంపికకు సంబంధించిన టెండరు నిబంధనల్లో ఉపాధి కల్పన అన్నఅంశమే లేదని అదిత్య తరపు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. విదేశీపెట్లుబడులను ఆకర్షించడంలో సింగపూర్‌ కన్సార్టియం విఫలమైతే ఎలాటి అపరాధ చర్యలుంటాయో కూడా లేదని ఆయన పేర్కొన్నారు. టెండరు నిబంధనల్లో ఆదాయం ప్రధానంగా పొందుపర్చి ఇక్కడ ఉపాధి కల్పన ముఖ్యమని మాట మారుస్తున్నారని కూడా ప్రకాశ్‌రెడ్డి వివరించారు. సింగపూర్‌ కన్సార్టియంకు ఎంత వాటా ఇస్తున్నారో బయిటపెట్టకుండా అంతకంటే ఎక్కువ ఇచ్చేవారినే పోటికి అనుమతిస్తామని చెప్పడం ఏ విధంగా స్విస్‌ చాలెంజి అవుతుందని ఆయన ప్రశ్నించారు. దానికి సంబంధించి లేఖ రాసినా క్రిడా అధికారులు తిరస్కరించారని గుర్తు చేశారు. వాస్తవానికి విదేశీ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించడం చట్టం ముందు నిలవదనీ, దేశీయ సంస్థలకు అవకాశం లేకుండా వుండేట్టుగా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.
కేసు విచారణ సోమవారం కూడా కొనసాగుతుంది గనక మరిన్ని వింత వాదనలు వినే అవకాశముంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *