కొలంబస్‌పై అమెరికాలో, గాంధీజీపై ఆఫ్రికాలో విముఖత

3662th02_oped_gandhi_8_3037723g

కాలం మారుతుంటుంది. అలవాట్లు వేషభాషలు కొన్నిసార్లు ఆచారాలు కూడా మారిపోతుంటాయి. మన దేశంలో అయితే కొత్తదేవుళ్లు పుట్టుకొస్తుంటారు. అయితే విచిత్రమేమంటే కాలంలో వచ్చే మార్పులు అంతకు ముందు గడిచిపోయిన చరిత్ర పట్ల దృక్పథాన్ని కూడా మార్చేస్తుంటాయి.అలాటి రెండు మార్పులు అంటే చరిత్ర దృష్టి మార్పులు చూద్దాం. వాటిలో ఒకటి అమెరికాను కనుగొన్న వ్యక్తిగా పేరొందిన కొలంబస్‌కు సంబంధించిందైతే మరొకటి భారతదేశం రాకముందు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహౌద్యమం ప్రారంభించిన వ్యక్తిగా పేరొందిన గాందీజీది.

కొలంబస్‌ అనేక విఫలయత్నాల తర్వాత 1492లో అమెరికా ఖండాన్ని చేరుకున్నాడు.నిజానికి అంతకన్నా ముందే కొంతమంది యూరోపియన్‌ నావికులు దాన్ని చేరుకున్నా ఈ యాత్ర తర్వాతనే అది వెలుగులోకి వచ్చింది. అందుకే ప్రతిఏటా అక్టోబరు రెండవ సోమవారాన్ని కొలంబస్‌ దినోత్సవంగా జరుపుకొంటూ వచ్చారు. అయితే గత కొంత కాలంగా ఈ విషయమై అమెరికన్లలో ముఖ్యంగా నల్లజాతివారిలో విముఖత పెరుగుతున్నది. కొలంబస్‌తో సహా ఆనాటి యాత్రలన్నీ నిజానికి నూతన భూఖండాలను కనుగొని వలసలుగా చేసుకోవడానికి, కొల్లగొట్టడానికి మాత్రమే జరిగాయి. అందులోనూ కొలంబస్‌ యాత్ర తర్వాత అక్కడి అమాయక ఇండియన్లను నెత్తురుటేర్లలో ముంచేశారు.బానిసలుగా చేసుకున్నారు. కొలంబస్‌కు మొదట అనుకున్నంత బంగారం దొరక్క హైతి నుంచి వేలాదిమందిని బానిసలుగా తీసుకెళ్లి తన ప్రయాణం కోసం చేసిన ఖర్చులు రాబట్టుకున్నాడు. ప్రజాశక్తి ప్రచురించిన నరclmbs111హంతలు ధరాధిపతుల(బరీ మై హార్ట అట్‌ వూండెడ్‌ నీ అన్న పుస్తకం అనువాదం) అమెరికా ప్రజల చరిత్ర(హిస్టరీ ఆఫ్‌ పీపుల్‌ అఫ్‌ అమెరికా) పుస్తకాల్లో ఈ చరిత్ర వివరంగా వుంటుంది. మొత్తంమీద అలాటి వ్యక్తి పేరిట పండుగ జరుపుకోరాదని ఇప్పుడు అమెరికాలో చాలా నగరాలు నిర్ణయానికి వచ్చి దేశీయ ప్రజా దినోత్సవంగా మార్చేస్తున్నాయి. అమెరికా ఇప్పుడు ప్రపంచాధిపత్యం చలాయించే ప్రధాన సామ్రాజ్యవాద దేశం గాని అప్పట్లో యూరోపియన్‌ దేశాలు అక్కడి రెడ్‌ ఇండియన్‌ తెగలను దారుణంగా హింసించి లోబర్చుకున్నారన్నది చరిత్ర.
ఇక గాంధీజీ విషయానికి వస్తే 1893-1914 మధ్య కాలంలో యువ బారిస్టరుగా ఆయన ఆఫ్రికా వెళ్లారు.అప్పుడాయన వయస్సు 24 ఏళ్లు. అక్కడ శ్వేతజాతి పాలకుల దౌర్జన్యం, రైలు పెట్టెలో నుంచి తోసి వేయడం, ఇతర వివక్షతలు వీటిపై పోరాటం మనం ఎప్పుడూ చెప్పుకునేవే. ఆఫ్రికాలో ఆరంభించిన నిరసన పద్ధతులనే ఆయన తర్వాత భారత స్వాతంత్ర పోరాటంలో మరింత బాగా ఉపయోగించి కోట్లమంది ప్రజలను కదిలించారనేది బాగా ప్రచారంలో వున్న భావన. నిజానికి నెల్సన్‌ మండేలా, కెన్నెత్‌ కౌండా వంటి వారు గాంధీ నుంచి ఉత్తేజం పొందినట్టు ప్రకటించారు.
అయితే భారత దేశంలో గాంధీ మహాత్ముడనిపించుకున్నారు గాని ఆఫ్రికా దశలో ఆయన యువకుడే. చాలా విషయాల్లో ఆయన భావాలు ఇంకా పూర్తి రూపం తీసుకోలేదు. ముక్యంగా భార్య పట్ల పిల్లల పట్ల ఆయన ప్రవర్తనపై చాలా విమర్శలున్నాయి. వాటిలో చాలా భాగం నిజం కూడా. పైగా ఆ కాలంలో ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్య విధేయుడు. బోయర్‌ యుద్ధంలో వలంటీరుగా పనిచేశారు. ఇవన్నీ అలా వుంచితే ఇప్పుడు ఆఫ్రికా దేశాల ప్రజలు ఆయనను తమ విముక్తి ఉద్యమంలో భాగస్వామిగా గుర్తించడం పట్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఉదాహరణకు ఘనా యూనివర్సిటీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముకర్జీ ప్రారంభించిన గాంధీజీ శిలా విగ్రహాన్ని తొలగించాలని సంతకాల ఉద్యమం మొదలైంది. ఏమంటే గాంధీజీ ఒక విధంగా వర్ణ దృష్టి కలిగిన వారనీ, కేవలం భారతీయుల కోసం పోరాడారే తప్ప స్థానిక నల్లజాతి వారిని దగ్గరకు రానివ్వలేదని వారు ఆగ్రహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ నీరా చందోక్‌ ఈ విషయమై హిందూలో శనివారం(8వ తేదీ) ఒక వ్యాసం కూడ రాశారు. గాంధీజీ అప్పటికి ఇంకా నిరసన కారుడుకాదనీ బ్రిటిష్‌ వారే నల్లజాతివారికి విముక్తినిస్తారని నమ్మారని ఆమె రాశారు. దీనికి తోడు ఇప్పుడు భారత దేశం కూడా ప్రపంచీకరణలో అమెరికా యూరప్‌ దేశాలతో చేరి చిన్న చిన్న ఆఫ్రికా ఖండాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు రాబట్టడానికి బయిలుదేరిందని వారిలో విముఖత పెరుగుతున్నదట. కాబట్టే ఘనాలో ఆయన విగ్రహం తొలగించేందుకై ఉద్యమం మొదలైంది. తర్వాత ఇతర చోట్ల కూడా ఇది జరిగితే ఆశ్చర్యం లేదు.

ఈ సందర్భంగానే ఒక వ్యక్తిగత విషయం గుర్తుకొస్తుంది. కీశేపెన్నేపల్లి గోపాలకృష్ణ అనే సీనియర్‌ పాత్రికేయుడు ఆఫ్రికాలో చాలా కాలం వుండి వచ్చారు. ఆయన అక్కడి భారతీయులపై ఒక పుస్తకం రాస్తే మేము ప్రచురించాం. అప్పుడు నేను ప్రజాశక్తి ప్రచురణలు చూసేవాణ్ని. తన పుస్తకానికి ఆయన రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని పేరు పెట్టారు. భారతీయులు ఆఫ్రికాలో చాలా కష్టపడ్డారనే భావంతో ఆ శీర్షికపెట్టారు. అయితే అది అంత సముచితంగా లేదని నేను చెప్పాను. మొదట ఆ దేశస్తులను కాదని మనమే రాళ్లెత్తినట్టు చెప్పడం అతిశయోక్తిగా వుంటుందని భావించాను.ఆయన కూడా ఈ సలహా పాటించి ఇంద్రధనస్సు ఏడోరంగు అనే శీర్షిక నిచ్చారు.ఇది అక్కడ వాడుకలో వున్న ప్రయోగమట. ఆయన కూడా భారతీయులు నల్లజాతివారితో కలవలేదని, నిజానికి తక్కువగా చూసేవారని చెప్పారు. ఆ పుస్తకానికి కెసిరెడ్డి అనే భారత దౌత్యాధికారి ముందుమాట రాశారు. ఈయన హైదరాబాద్‌ వాస్తవ్యులు. ఐరాసలో బాధ్యతల నిర్వహణతో సహా దేశదేశాల్లో పనిచేశారు. ఇటీవలనే సిరియాలోనూ యుద్ధ పరిస్థితి పరిశీలన సంబంధమైన పర్యటన జరిపి వచ్చారు. గత శనివారం మాతో టీవి5 చర్చలో పాల్గొన్నప్పుడు ఈ విషయం ప్రస్తావిస్తే భారతీయుల గురించిన ఆ అంచనా నిజమేనన్నారు. బహుశా ఇవన్నీ ఘనా వంటి చోట్ల వ్యక్తమవుతున్నాయనుకోవాలి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *