డిప్రెషన్‌ దాచని తారలు

deepjohar
మనసులేని బతుకొక నరకం, మరువలేని మనసొక నరకం.. అంటూ రెండు కోణాలనూ ఒక పాటలో చెప్పాడు మనసుకవి ఆత్రేయ. శరీరానికి తలనొప్పి కడుపునొప్పి వచ్చినట్టే మనసుకూ బాధలు కలిగితే మహాపరాధమేమీకాదు. దాన్ని దాచిపెట్టుకుని మరింత పెంచుకుని చివరకు బలై పోవడం కంటే బయిటపడి బాగుపడటం మంచిది. అందుకు విశ్వాసపాత్రుల విజ్ఞానవంతులూ అనుభవజ్ఞుల సహాయం పొందొచ్చు. అయినా చాలా మంది ఆ పనిచేయరు.
మామూలుగా సినిమా తారలంటేనే తళుకుబెళుకుల మధ్య జీవిస్తుంటారు. అందం ఆకర్షణ వారిని వెంటనంటే వుంటాయి. వారిని ఆరాధిస్తూ వారిలా వుండాలని ఆశపడుతూ వుండలేనందుకు బాధపడుతూ లక్షల మంది భావావేశాలకు ఆవేదనలకు గురవుతుంటారు. కాని ఆ నటీనటులూ కళాకారులు కూడా అనుక్షణం అంతులేని అభద్రతలో అనారోగ్యకరమైన పోటీలో కొట్టుమిట్టాడుతుంటారనేది నిజం. ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన తారలెందరు విషాద మరణాలు కొనితెచ్చుకోలేదు? ఇందుకు ముఖ్యమైన కారణం డిప్రెషన్‌. మాంద్యం. నిస్తబ్దత. అనేక కారణాల వల్ల రావచ్చు. వైఫల్యాల వల్ల రావచ్చు.తిరస్కరణ వల్ల కావచ్చు. అపజయాలు అవమానాలు వెంటాడవచ్చు. ఏదైతేనేం మనుషుల మనసులను ఆవరించి అల్లాడించే మహమ్మారి డిప్రెషన్‌కు వీరూ అతీతులు కాదు. ఆ మాటకొస్తే గొప్పగా ప్రచారంలో వున్న చాలామంది ఈ మానసిక రుగ్మతకు గురయ్యే వుంటారు. కాకపోతే మన దేశంలో గతంకంటే కొంత మార్పు వచ్చినా మానసిక వ్యాధుల గురించి మాట్లాడ్డం చిన్నతనంగా పరిగణిస్తారు. మానసికసమస్య అంటే ఉన్నాదం అనుకుంటారనే భయం. ఈ కారణంగానే ఎంతోమంది ప్రతిభావంతులు ప్రాణాలైనా తీసుకుంటారు గాని ఆ మానసిక రుగ్మతను పోగొట్టుకోవడానికి ప్రయత్నించరు.
ఇలాటి మనసమాజంలో బాలివుడ్‌ అగ్ర కళాకారులు నిస్సంకోచంగా తాము డిప్రెషన్‌కు గురైనప్పటి భయానక జ్ఞాపకాలు, బయిటపడటానికి చేసిన పోరాటం, అందుకు సహకరించిన మిత్రులు వైద్యుల గురించి చెప్పడం హర్షించదగ్గ విషయం. చాలాస్వల్ప స్థాయి ఔషదాలు స్నేహితులు హితులు ఇచ్చే కొద్దిపాటి ఉత్సాహంతో బాగయ్యే ఈ రుగ్మతలకు జీవితాలు లేదా ప్రతిభా విశేషాలు బలిచేసుకోవడం అవివేకం. తాను చాలా పీక్‌లో వున్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్‌ అనే సినిమా మొత్తం డిప్రెషన్‌లోనే చేశానని తర్వాతే ఎవరో ఇచ్చిన సలహాపై డిప్రెషన్‌ మందులు తీసుకుని బయిటపడ్డానని దీపికా పడుకునే చెప్పారు. ఆ రోజుల్లో ఆమె ప్రేమికుడుగా చెప్పబడే రణవీర్‌ సింగ్‌ కూడా తర్వాత ఇలాటి విషయాలే వెల్లడించాడు. తాజాగా అనేక హిట్లు పండించిన ప్రసిద్ధదర్శకుడు కరణ్‌ జోహార్‌ కూడా ఈ విషయంలో తన చేదు జ్ఞాపకాలు ఎన్‌డిటివికి చెప్పారు. ఆ దశనుంచి బయిటపడటానికి గట్టిగా పెనుగులాడవలసిందేనన్నారు. డిప్రెషన్‌లో ఏదీ ఎవరు సంతోషం కలిగించవకపోవచ్చనీ, అయినా ఎదురీదానని తన అనుభవం చెప్పారు.44 ఏళ్ల వయసులో వంటరిగా వుండటంలోని దుర్భరత్వాన్ని కూడా ఆయన చెప్పినా ప్రధాన సందేశం మాత్రం నిరాశను నిరుత్సాహాన్ని జయించాలన్నదే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *