అవిశ్రాంత అక్షర వజ్రాయుధ యోధుడు

వజ్రాయుధ కవి ఆవంత్స సోమసుందర్‌ అస్తమయంతో తెలుగు సాహిత్యం మాత్రమే గాక భారత దేశ ప్రగతిశీల సాంసృతిక రంగం కాకలు తీరిన ఒక సాహిత్య శిఖరాన్ని కోల్పోయింది. ఆయనకు బిరుడులూ పదవులూ ఏమున్నా లేకపోయినా డెబ్బై ఎనభై ఏళ్లపాటు ప్రజల విముక్తికి కలాన్ని అంకితం చేసిన ఘనత వుంది. అభ్యుదయ రచయితల ఉద్యమ వ్యవస్థాపక నాయక బృందంలో అందరికన్నా అత్యధిక కాలం మనమధ్యన గడిపిన ప్రత్యేకత కూడా ఆయనదే. ఇప్పుడాయన కన్నుమూతతో బహుశా ఆ తరం వారెవరూ మిగల్లేదని చెప్పొచ్చు. శ్రీశ్రీ మహాప్రస్థానం లాగే తెలుగు వారికి చిరస్థాయిగా నిలిచిన కావ్యం సోమసుందర్‌ వజ్రాయుధం,దాశరది, తెలుగు వారు అమితంగా ఉటంకించే పంక్తులు ఒకవీరుడు మరణిస్తే ప్రభవింతురు వేలమంది..ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు.. ఆశయాలకోసం సాగే మహాప్రస్థానం ఆగేది కాదన్న సందేశం ఇందులో అంతర్లీనం.
సోసు సాహిత్య జీవితం సుదీర్ఘమైంది. సుసంపన్నమైంది. వైవిధ్య భరితమైంది. నిష్కర్షతో సాగిన నిబద్ద నిర్మాణాత్మక జీవితం ఆయనది. ఆయన జీవితంలో గాని సాహిత్యంలో గాని శషభిషలుండవు. కాళ్లుతడబడడం, నీళ్లు నమలడం వుండవు. చెప్పదల్చుకుంది చెప్పడమే. అనదల్చుకున్నది అనడమే. అయితే ఆ చెప్పిందాంట్లోనూ అన్నదాంట్లోనూ అభ్యుదయం తప్ప అన్యం వుండదు. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆఖరి క్షణం వరకూ కృషి అక్షరజీవిగా ఆయనతో పోల్చదగిన వారు చాలా తక్కువ. ఆయన జీవిత గమనం కూడా అంత విలక్షణమైంది.avasta 44442
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో 1924 నవంబరు 18న ఆయన పుట్టారు. తల్లి వెంకాయమ్మ వ్యాధి గ్రస్తురాలుగా మరణించకముందే తనను చెల్లెలికి దత్తత ఇవ్వడంతో పిఠాపురం చేరారు. తండ్రి కాళ్లూరి సూర్యప్రకాశరావు స్యయాన స్వతంత్ర యోధుడు. ఆ దంపతులకు ఏడో కుమారుడుగా పుట్టిన సోసు దత్తత కారణంగా ఆవంత్స అయ్యారు. అలాగే గొప్ప ఆస్తికి వారసుడూ అయ్యారు. పెంపుడు తల్లి అప్పటికే వితంతువు.. ఆమె భర్త వెంకటరావు ఇంగ్లీషు టీచరు మాత్రమే గాక సాహిత్యాభిలాషి కావడంతో ఇంట్లొ కావలసినన్ని పుస్తకాలు పోగేసి పోయాడు.అయిదో ఏటనుంచే సోసు పురాణాలు భాషా వ్యాకరణాలు నేర్చుకోవడం మొదలెట్టారు. పద్యాలు పాడడమే గాక రాయడమూ పట్టుకున్నాడు. పిఠాపురం మంచి సాంసృతిక కేంద్రం. స్థానిక రాజు సూర్యరాయల పేరిటే పండితులు నిఘంటువు వెలవరించారు. ఆయన పేరిటనే సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం కూడా వుంటే బాగా చదువుకున్నాడు. ఆ గ్రంథాయలాధికారి రంగనాయకులు రోజూ అంతసేపు కూచుంటున్న ఈ కుర్రాడు నిజంగా తెలివైనవాడని పరీక్షించి తెలుసుకుని తదుపరి అధ్యయనానికి నిర్దేశం చేశాడు. రవీంద్రనాథ టాగూరు తమ వూరు మీదుగా వెళ్తున్నారని తెలిసి స్టేషన్‌కు వెళ్లి చూశాడు. విశ్వనాథ సత్యనారాయణ ఒక సభకు వచ్చి పండిత ప్రసంగం చేస్తే పట్టుపట్టి మరీ కిన్నెర సాని పాటలే పాడించుకున్నాడు.
ఇదంతా 1940లనాటి మాట. సాహిత్యాసక్తితో పాటు రాజకీయ చైతన్యం కూడా పెంచుకుంటున్న సోసు 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో విద్యార్తుల సమ్మెకు నాయకత్వం వహించి పోలీసు నిర్బంధం చవిచూశాడు.అప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించారు.1943లో కాకినాడ పిఆర్‌ కాలేజీలో చేరారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *