జ్వలిత దళిత స్వరాలు కుసుమ ధర్మన్న, జాషవా

kusuma-copyకుసుమాంజలి  పేరిట కుసుమ ధర్మన్న సాహిత్య సమాచాలోచన పుస్తకావిష్కరణలు ే సెప్టెంబరు 18న రాజమండ్రిలోనూ, జాషవా సాంసతిక వేదిక ఆవిర్బావ సభ, సెమినార్లు, పాబ్లో నెరూడా పుస్తకావిష్కరణ వారోత్సవం 23 నుంచి 28 వరకూ విజయవాడలోనూ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాల ఆహ్వానాలు, సాహిత్య పరిశోధకుల వ్యాసాల సంకలనానికి నేను రాసిన ముందు మాట, telakapalliravi.com/…/Jashuva-Invitatio-1.pdfకుసుమ ధర్మన్నపై రాసిన పాట kusuma-dharmanna-program-invitation-26-08-2016-2

అందిస్తున్నాను.

22222

ధర్మన్న దర్శనం (ముందు మాట)

చరిత్ర ఎప్పుడూ విజేతల ఖడ్డంతో లిఖించబడుతుందంటారు. అది కూడా ఆధిపత్య అక్షరాలతో. ఈ క్రమంలో ధిక్కార స్వరాలు వినిపించకుండా విప్లవ రూపాలు కనిపించకుండా అనేక కవాటాలుంటాయి. కట్టుదిట్టాలుంటాయి. అధికార అనధికార ఆంక్షలు అనుమతులూ వుంటాయి. కనుకనే చరిత్ర పరిణామాల భావాల సారాంశమైన సాహిత్యం సృజన కూడా చాలాసార్లు చిరునామా లేకుండా పోతాయి.అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అని ఎప్పటికప్పుడు అన్వేషణ సాగించవలసిందే. ఈ రోజున తెలుగు వారి చైతన్యానికి అద్దంపట్టే అసమాన అగ్నికణికల వంటి వేమన పద్యాలు మనం పాడుకుంటున్నామంటే అలాటి అన్వేషణ జరిపిన బ్రౌన్‌ మహాశయుని శ్రద్ధాసక్తులే కారణం. ప్రాచీన సమాజంలోనే హేతుబద్దతను ప్రతిబింబించిన ఆలోచనాపరులను చదువుకోగలుగుతున్నామంటే పురోగామి మేధావుల పరిశోధకుల అధ్యయనాలే మూలం. ముప్పనుకున్నవాటిని కప్పిపుచ్చడం గొప్పను పెంచేవాటిని నెత్తిన పెట్టుకోవడం పాలకవర్గాల లక్షణం.అవసరం. ఇందుకోసమే చరిత్ర రచనలోనూ సాహిత్య సేకరణ ప్రచురణ వంటి వాటిలోనూ వారసత్వ స్వీకరణలోనూ అనేక కుట్రలు కుత్సితాలు. మానవ జాతి విముక్తి సిద్ధాంత కర్త కారల్‌ మార్క్స్‌ భావాలను పరోక్షంగా దొంగిలిస్తూనే పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు ఆ పుస్తకాల ప్రచురణ బాధ్యత తీసుకోలేదు. సోషలిస్టు దేశాలు వచ్చాకే అత్యధిక రచనలు వెలుగుచూశాయి. మోర్గాన్‌ పురాతన సమాజం విషయంలోనూ అదే జరిగింది. హీనులుగా తాము ఈసడించిన వారిని చరిత్ర హీనులుగానూ చేయాలన్న దాష్టీకం ఇందులో దాగి వుంటుంది.అయితే ఆ ఆంక్షలనూ ఆధిపత్యాలనూ ఛేదించుకుని ధిక్కార స్వరాలు వినిపించే వీరులూ విప్లవ కారులూ సంస్కర్తలూ ప్రభవిస్తూనే వుంటారు. ఉత్తేజమందిస్తూనే వుంటారు. కుసుమ ధర్మన్న అక్షరాలా అలాటి యోధుడు, సాహిత్యంలోనూ సమాజ సమరాంగణంలోనూ సవ్యసాచిలా పోరాడిన వీరుడు. ఆది కావ్యం పుట్టిందనే రాజమహేంద్ర వరంలోనే ఆది ఆంధ్ర స్వరం వినిపించిన ధీరుడు, కర్మ వీరుడు ధర్మన్న. ఇది ఆయన సంస్మరణ సందర్భం. రాజమండ్రిలో సాహిత్య సామాజిక సంస్థల సమిష్టి ఆధ్వర్యంలో కుసుమాంజలి పేరిట ధర్మన్న సాహిత్య సమాలోచన జరుగుతున్న సమయంలో ఈ పుస్తకం వెలువడుతున్నది. సభలు ముగిసిన తర్వాత కుసుమ ధర్మన్న సాహిత్య సందేశం జీవితాదర్శం సజీవంగా వుంచే సంకలనం.
కుసుమ ధర్మన్న పేరు చాలా కాలంగా వింటున్నా- మాకొద్ది నల్లదొరతనమూ అనే చరణం గుర్తు చేసుకుంటున్నా నిజానికి ఆయన జీవిత సాహిత్యాల గురించి తెలిసింది చాలా తక్కువ. తెలిసిన దాంట్లోనూ గ్రంథస్తమైంది మరీ తక్కువ. వచ్చిన సమాచారంలోనూ సందేహాలు సంవాదాలు మరీ ఎక్కువ .దీనికి ఎవరు కారణం, ఎంత వరకు కారణం, అందులో యాదృచ్చికత ఎంత కుత్సితం ఎంత వంటి ప్రశ్నలు రాకుండా వుండవు, వాటికి సమాధానాలు ఒక పట్టాన దొరకనూ దొరకవు. ఏది ఏమైనా దళిత సాహిత్య సామాజిక ప్రథమ ప్రయోక్తల్లో ఒకరైన కుసుమ ధర్మన్న జీవితం గురించి సమగ్రమైన సమాచారం లేదన్న కొరత నిజం. ఈ పుస్తకం దాన్ని చాలా విధాలుగా చాలా కోణాలలో భర్తీ చేస్తుందనే విశ్వాసం కూడా నిజం.
ఈ పుస్తకంపై అలాటి విశ్వాసం కలగడానికి చాలా కారణాలున్నాయి గాని ముఖ్యమైంది ఇందులోని రచయితల నేపథ్యం, నేర్పరి తనం. అంతకంటే కూడా వారికి ధర్మన్నపై వున్న అపార గౌరవం విశ్వాసం.అందుకే ఒక్కొక్కరూ ఒకో కోణంలో కుసుమ ధర్మన్న దర్శనం చేయించారు. అందరికీ అందుబాటులో వున్న విషయాలను పొందుపరుస్తూనే తమవైన పరిశోధనలనూ పరిశీలనలనూ అందించారు. వివాద గ్రస్తమైన విషయాలలోనూ తమ అంచనాలు అభిప్రాయాలు నిష్కర్షగా మన ముందుంచారు. అందుకే ధర్మన్న అభిమానులకే గాక సాహిత్య పాఠకులందరికీ ఇదో అరుదైన కానుక. ధర్మన్నపై అధ్యయనాలకు గొప్ప చేర్పు. ఇది విడుదలైన తర్వాత మరెవరూ ఆయనకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని ఫిర్యాదు చేయరు.ఇప్పటి వరకూ జరిగిన అలక్ష్యంపై ఆగ్రహావేదనలకు ఆశ్చర్యానికి గురి కాకుండా వుండలేరు. ఏమంటే ఆయన పుట్టిన తేదీ కాదు, సంవత్సరం ఏమిటనే దానితో మొదలు పెట్టి ప్రతిదీ అనిశ్చితమే. అలా అని ఏదో ఒకటి ఖాయం చేసి వదిలారా అంటే లేదు. ఆయన పుట్టిన ఏడాదిని కాస్త వెనక్కు నెట్టేవారు కొందరైతే ముందుకు జరిపేవారు మరికొందరు.దీనంతటికీ కారణం ఒక్కటే- ఆయనకు అగ్రసనాధిపత్యం దక్కాలా వద్దా అన్న మీమాంస. అది తక్షణం ఆయనకు దక్కాలనే వారు కొందరైతే అలా జరక్కుండా ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకి తెచ్చిపెట్టేవారు మరికొందరు. ఈ వాదోపవాదాలేమిటి? ఇన్ని భిన్న వాదనలేమిటి?వీటికి సమాధానం ఈ సంకలనంలో లభిస్తుంది. దండగమారి సందేహాలు తొలగించి ధర్మన్న విశిష్టతను ఎరుకపరుస్తుంది.
ఈ సంకలనంలో రచయితలంతా ప్రముఖులూ ప్రజ్ఞావంతులుగా పరిచితులైన వారే. ధర్మన్నను కలుసుకున్న తొలితరం కవి రచయిత బోయి భీమన్న జ్ఞాపకాలతో మొదలవుతుంది. కుసుమ ధర్మన్న ఇంట్లోనే గుర్రం జాషవాను మొదటిసారి కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంటారు భీమన్న. వారిద్దరి కలయికలో ఆ ఇల్లు సాహిత్య చర్చలతో సరస్వతీ విలాసంలా వుండేదన్న భీమన్నమాట తనపై పడిన ప్రగాఢ ముద్రను ప్రతిబింబిస్తుంది. ధర్మన్న సమగ్ర వ్యక్తిత్వాన్ని కూడా తొలి దశలోనే చూసిన వ్యక్తిగా భీమన్న చక్కగా చెబుతారు. ఇక తొలిసారి ఆయనపై ఒక గ్రంథమంటూ వెలువరించిన సివి పరిశీలనాత్మక రచనలో భాగాలు చూస్తే ఎలాటి సామాజిక అంతరాల దొంతరల మధ్య ధర్మన్న తన ధర్మయుద్ధం సాగించాడో బొధపడుతుంది.మొదటే చెప్పుకున్నట్టు ఆయనకు సంబంధించిన సాహిత్య వ్యక్తిగత ఆకరాలు దాదాపు అదృశ్యమై పోయిన తీరును సివి అర్థవంతంగానూ ఆగ్రహపూరితంగానూ వివరిస్తారు. దేశభక్త మహాకవి గరిమెళ్ల సత్యనారాయణ మాకొద్ది తెల్లదొరతనము పాటకూ ధర్మన్న మాకొద్ది నల్లదొరతనం అంటూ వర్తమానంలో కుల వివక్షను చీల్చి చెండాడిన ధర్మన్న పాటకూ తేడాలేమిటో సివి బాగా చెబుతారు.
కొలకలూరి మధుజ్యోతి, దార్ల వెంకటేశ్వరరావు, తరపట్ట సత్యనారాయణ, పుట్ట హేమలత, గడ్డి సుబ్బారావు, ఆశాజ్యోతి, శ్రీదేవి, కోయి కోటీశ్వరరావు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, మేడిపల్లి రవి కుమార్‌, మల్లెపల్లి లక్ష్మయ్య, గూటం స్వామి, జివి రత్నాకర్‌, శ్యాంషా తదితరుల సాహిత్య పరిశోధకులుగా బోధకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిష్టాతులు. అంతేగాక కుసుమ ధర్మన్న భావధారతోనూ బాధామయగాధలతోనూ ప్రగాఢంగా పెనవేసుకున్న సాహిత్య సామాజిక భావుకులు. అంబేద్కర్‌, కుసుమ ధర్మన్న, జాషవా, తదితరుల అక్షరాలలో తమను తాము చూసుకుంటూ పెరిగిన వారు. తమ జీవిత సంఘర్షణలనూ సంవేదనలనూ ఆ వైతాళికుల అడుగుజాడల్లో వెతుక్కుంటున్న వారు. అందుకే ఈ రచనలన్నీ బలంగా పలుకుతాయి. వాటిలోని వివరాలు విశేషాలు ఇక్కడ సుదీర్ఘంగా ప్రస్తావించడం పునరుక్తిలా వుంటుంది గనక ఆ పని పెట్టుకోను.

ముందే చెప్పినట్టు ధర్మన్న విషయంలో అందుబాటులో వున్న సాహిత్యం తక్కువే. ప్రధానంగా హరిజన శతకం మాత్రమే అందుబాటులో వుంది గనక దానిలోని పద్యాల ఆధారంగా విశ్లేషణ చేస్తూ సామాజిక వివక్షతలనూ దురన్యాయాలను ఆయన ఎంత శక్తివంతంగా ఎండగట్టారో కళ్లకు కట్టి చూపించారు. సాహిత్య విలువలతో పాటు సామాజిక పరిణామాన్ని కూడా ఆనాటికే అసమాన ప్రతిభతో పొందుపర్చడం కుసుమ ధర్మన్న పద్యాలలో గొప్ప లక్షణం. దార్ల వెంకటేశ్వరరావు, మేడిపల్లి రవి కుమార్‌, రాచపాళెం వంటి వారు ఆ అంశాలను ఎరుక పర్చిన తీరు అమోఘం. స్వంత ఆస్తిలేని సమాజం, ఆస్తితో కూడిన వర్గసమాజం, ఆర్యుల ప్రవేశానంతరం కుల సమాజం, కులాధిక్యత గల పీడక సమాజం, గాంధీజీ చెప్పిన సంస్కరణ సమాజం ఈ దశలన్నిటినీ పద్యాలలో వర్ణిస్తూ ధర్మన్న హరిజనులు విముక్తి కోసం జరగవలసిందేమిటో ప్రబోధించారు. ఇక సామాజిక న్యాయమే గాక సామ్యవాదం కూడా ఆకాంక్షించిన ధర్మన్న దార్శనితకతను మేడిపల్లి విశదపర్చారు. దళితులపై సాగే సామాజిక పీడనను వేదనాభరితంగానో ఆగ్రహపూరితంగానో చిత్రించి వూరుకుంటే ధర్మన్న సాహిత్యం ఇంత సమగ్రత సంతరించుకునేది కాదు. వారు శ్రమజీవులుగా వ్యవసాయ కూలీలుగా ఇంకా అనేక రకాలుగా సంపద సృష్టిస్తున్నారని వారు లేకుంటే సమాజం నడవదని ఆయన సోదాహరణంగా శక్తివంతంగా చెప్పగలిగారు. సేవలకోసం భోగాల కోసం తమను తమ స్త్రీలను ఉపయోగించుకునేప్పుడు కులం అంటు అడ్డుకావడం లేదని అపహాస్యం చేశారు.ఆక్షేపించారు. తెలుగు సాహిత్యంలో శ్రమ జీవుల జీవితాల ప్రస్తావన తక్కువే అనుకుంటే దాన్ని సామాజిక వివక్షతతో పాటు చెప్పడంలో ధర్మన్న సమగ్ర దృష్టికోణం మనకు అవగతమవుతుంది.

చారిత్రిక పరిణామాలను గురించి, వ్యక్తుల జీవితాలనూ పరిశీలించేప్పుడు భిన్నాభిప్రాయాలుండటం సహజం. అందులోనూ తారీఖులు దస్తావేజులు లేని పరిస్థితుల్లో ధర్మన్న వంటి వారి పాత్రపై గాని ప్రభావంపై రకరకాల అంచనాలు వుండొచ్చు. వున్నాయి కూడా. ఆధిపత్య సమాజం నీడల్లో వున్నాము గనక ప్రతిదానికి ఎవరో ఒకరికి ఆదిపీఠం ఆపాదించాలనే ఆరాటం వుంటుంది. దళిత సాహిత్యానికి ఆద్యులెవరనే అనవసర మీమాంస ఆ కోవలోదే. జాషవా ధర్మన్న భాగ్యరెడ్డివర్మ ఇంకా అంబేద్కర్‌ పేర్లను కూడా తీసుకొచ్చి ముందువెనకల తర్జనభర్జనలో మునిగి తేలడం, ఏవో ఆధారాలతో నిర్థారణలు చేయడం ఈ దశలో అవసరం లేనిపని. ఈ వ్యాసాల్లో కొందరు ఆ తరహా చర్చ పట్ల ఉత్సాహం చూపించడాన్ని అర్థం చేసుకోవచ్చు గాని అత్యుత్సాహం అక్కర్లేదంటాను. ఇంకా అణగారిన వర్గాల చరిత్రను సాహిత్య సామాజిక దోహదాలను సేకరించుకోవలసిన పునర్నిర్మించుకోవలసిన స్థితిలోనే వున్నాం.ధర్మన్న రచనలన్నీ లేవు సరికదా ఆయన నడిపిన జయభేరి పత్రిక ప్రతులు కూడా లేవు. ఈ పత్రికా పర్వంపై కొంకె గౌరేశ్వరరావు ప్రత్యేకంగా రాయడం పాత్రికేయుడుగా నాకు మరీ సంతోషం. ఆంధ్ర దేశంలో కమ్యూనిస్టుపార్టీ తొలి మహాసభ జరిగిన 1933లో శ్రీశ్రీ జయభేరి కవితతోనే మహాప్రస్థానం ప్రారంభించడం, ధర్మన్న ఆ పేరుతోనే పత్రిక మొదలుపెట్టడం గొప్పయాదృచ్చిక ఘటనలుగా కనిపించినా వాటిలో చారిత్రిక సందేశం వుంది.. విముక్తి శక్తులు తమ మార్గం వెతుక్కుంటున్న సంకేతాలవి. మిగిలిన చాలా మంది కవులలో లేని స్పష్టత దార్శనికత కుసుమ ధర్మన్నలో వున్నాయి. మహాప్రస్థానం రాజే నాటికి నాకు మార్క్సిజం తెలియదని శ్రీశ్రీయే చెప్పారు. కాని ధర్మన్న అప్పటికే చైతన్యపూర్వకంగా సామ్యవాద సందేశం ఇచ్చేశారు. ఇది శ్రీశ్రీని తక్కువ చేయదుగాని ధర్మన్నను ఉన్నతుణ్ని చేస్తుంది. సామ్యవాదం గిట్టని హిందూత్వ వాదం అన్న ఆయన రచననూ శీర్షికనూ చూస్తే ఎవరైనా ఇప్పుడు నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వ కాలంలో రాశారని పొరబడే ప్రమాదముంటుంది. దేశ కాల పరిమితులను అధిగమించే ఈ అధ్యయన తత్పరతే ఆయనను అగ్రజుడుగా నిలిపింది.
గోదావరి తీరంలో కందుకూరి వీరేశలింగం శిష్యుడుగా మొదలైన ధర్మన్న సంస్కరణ,స్వాతంత్రం సామాజిక న్యాయం సామ్యవాద భావనల అపురూప సమ్మేళనం అనడంలో సందేహం లేదు. ఈ విషయంలో ఆయనకు దగ్గరగా రాగలిగిన వారు చాలా చాలా అరుదు. చాలామంది రచయితల్లా పరాధీనమై పోకుండా సామాజిక రంగస్థలంపైనా అనేక బాధ్యతలు నిర్వహించడం ఆయన దక్షతకు దర్పణం. స్వతహాగా వైద్యుడు. ఉపాధ్యాయుడు. కవి రచయిత పరిశోధకుడు. అప్పటికే దళితుల సాధికారత కోసం బ్యాంకు స్థాపించాలని గుర్తించిన అవగాహనాశీలి. గాంధీని ఎంతగా గౌరవించినా ఆయనను తన నిలయానికే రప్పించుకుని ఆత్మగౌరవం చాటిన ధైర్యశాలి. దళిత సూర్యుడు అంబేడ్కర్‌తోనే సత్కారం పొంది సార్థకజీవుడైన ఆశయ ధనుడు. వేయిపడగల హిందూ వివక్షా సమాజంలో అంటరాని ముద్ర వేయించుకున్న వారి ఆలయ ప్రవేశానికై ఉద్యమించి ఆ ఉద్రేకంలోనే వూపిరి వదలిన ఉదాత్త చరితుడు. ఉత్తేజ ప్రదాత. మత మార్కెట్‌ తత్వాలతో పాటు మనువాదం కూడా పునరుద్ధరణ పొందినట్టుగా చెలరేగిపోతున్న నేటి నేపథ్యంలో ధర్మన్న జీవిత సాహిత్య సందేశాలను విస్తారంగా జనంలోకి తీసుకు వెళ్లాలి. చైతన్యం పంచాలి. పెంచాలి. ఈ పుస్తక ప్రచురణ ఆ కృషిలో గొప్ప ముందడుగు అవుతుంది. ఇక ముందు ఎవరు కుసుమ ధర్మన్నపై పరిశోధన చేసినా ఇది చూడకుండా వారి అధ్యయనం సంపూర్ణం కాజాలదు. ఎంతో శ్రమ పడి భక్తిశ్రద్దలతో సామాజిక బాధ్యతతో ఈ రచనలు చేసిన వ్యాసకర్తలనూ ప్రచురణ చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌కూ నా అభినందనలు.

 

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *