సినిమాల విజయం..కొరటాల శివ విశ్లేషణ

koratala-siva

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే తన చిత్రం జనతా గ్యారేజీపై జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. అవి ఫలించాలనే మనమూ కోరుకుందాం. అయితే ఈ సందర్బంగా కొరటాల శివ ఇంటర్వ్యూలలో చెబుతున్న మాటలు చూస్తుంటే కొంచెం అవాస్తవికత కనిపిస్తుంది. మొడటి చిత్రం మిర్చి, రెండో చిత్రం శ్రీమంతుడు పాజిటివ్‌ క్యారెక్టర్స్‌ వల్లే హిట్‌ అయ్యాయని ఆయన విశ్లేషణగా వుంది. ఇలాటి ప్రయోగాలు గతంలో కూడా వున్నాయి. పాత కాలానికి వెళితే శరత్‌బాబు నవలల్లో ఏ పాత్ర దుష్టంగా వుండదు. ఆ సంగతి అలా వుంచితే మిర్చిలో  సత్యరాజ్‌ వేసిన తండ్రి పాత్రలో సానుకూల లక్షణాలున్నమాట శాంతికోసం పాకులాడిన మాట నిజం. కాని హింసకు లోటు లేదు. హఠాత్తుగా వచ్చిన కుమారుడు ప్రభాస్‌ కూడా చాలానే చేస్తాడు. అవి ఒక కొలిక్కి వచ్చాక శాంతి సూక్తులతో పరివర్తన చెందవచ్చు గాని ప్రేక్షకులకు మాత్రం కావలసింది ఇచ్చేశారు. దానికి తోడు శత్రువు ఇంట్లో వుండి ఒక్కొక్కరిని మార్చే ఒక మెలో డ్రామా.. నిజంగా ఆ చిత్రానికి బలం తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించిన తీరే.
మహేష్‌ బాబు స్టార్‌డం, అప్పుడే మోడీ పిలుపిచ్చిన గ్రామాల దత్తత నేపథ్యం కారణంగా శ్రీమంతుడు విజయం సాధించింది తప్ప కథ బలహీనంగానే వుంది. మరీ ముఖ్యంగా ఆదర్శంగా చూపించిన రాజేంద్ర ప్రసాద్‌ పాత్రలో వాస్తవికత అసలు లేదు. రైతులు ఆత్మహత్యలు గ్రామాల నుంచి వలసలు అనే సమస్యలను కూడా ప్రస్తావించారే గాని నిజమైన పరిశీలన లేదు. ఇక వ్యవస్తాగతమైన సమస్యలు వదిలేసి మంత్రి కుటుంబం దౌర్జన్యాలే ప్రధానమైనట్టు వారిని తుదముట్టించడమే పరిష్కారమన్నట్టు చూపించారు. కావలసింది ధీమంతులే గాని శ్రీమంతులు కాదు అని నేనప్పట్లో వ్యాఖ్యానించాను. అందులోనూ బిలియనీర్‌ తండ్రిగా జగపతి బాబు కూ మహేష్‌కు మధ్య అనుబంధం బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఆదర్శం ఆయనకూ వున్నట్టు చూపించారు గనక శ్రీమంతుడి ప్రత్యేకత కూడా పెద్దగా నిలిచింది లేదు. ఇక హీరో లుంగీ కట్టుకుని వెళ్లడం వంటివి ఆకట్టుకుని వుండాలి. మాటిమాటికి చెక్కులు రాసిచ్చే సొల్యూషన్‌ చాలా తేలికైంది. ఆ చిత్రంలో నిజంగా తండ్రి కొడుకుల అనుబంధం తప్ప మరేదైనా అంశం హత్తుకుపోయి వుంటుందా అంటే చెప్పదం కష్టం.
ఇవన్నీ చెప్పడం శివను తక్కువ చేయడానికి కాదు. కాని యువ దర్శకులు తమ ప్రతిభను కాన్ని గీతలలో బంధించేసి విజయాలు వెతుక్కుంటే పూర్తి సంతృప్తి లభించదు. జనతా గ్యారేజీలో శివ నూతనత్వం చూపించి వుంటారని భావిద్దాం. ముచ్చటగా వస్తున్న ఆయన మూడో చిత్రం ఘన విజయం సాధిచాలని మనస్పూర్తిగా ఆశిద్దాం. దాంతోపాటే ఈ దర్శకుడు పరిధి పెంచుకోవాలనీ కోరుకుందాం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *