పవన్‌ సభ- కమలం కల కకావికలు

6666661

జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగంలో ప్రత్యేక హౌదాకు సంబందించిన అంశానికి అధిక ప్రాధాన్యత రావడం సహజమే గాని రాజకీయంగా చాలా ముఖ్యమైన మరో విషయం గుర్తించవలసి వుంది. గత రెండు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో తమ పార్టీ విస్తరణ కోసం బిజెపి సిద్ధం చేసుకున్న బృహత్‌ వ్యూహాన్ని ఆయన వెంకన్న సాక్షిగా చిందరవందర చేశారు. ఏడాది కిందటి వరకూ ఏ బిజెపి నాయకుడు చూసినా పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీలో చేరడం ఖాయమనే భావన కల్పించేందుకు ప్రయత్నించారు. మా సంభాషణల్లోనూ చెబుతుండేవారు. ఎన్నికల ప్రచారానికి ముందు గుజరాత్‌ వెళ్లి మోడీని కలుసుకోవడం, తర్వాత వారి తరపున పర్యటించడం ఇవన్నీ అందుకు కారణమైన మాట నిజం. ప్రత్యేక హౌదా ప్యాకేజీల విషయంలోనూ పవన్‌ తీవ్రంగా మాట్లాడకపోవడానికి ఒక కారణం బిజెపి ఏదో జరగబోతుందన్న భావన ఆయనకు కలిగించడం. చంద్రబాబునాయుడుకు నిజం తెలిసినా తెలియనట్టే ద్వంద్వ రాజకీయం నడిపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదో ఒక దశలో తను గట్టిగా నిలబడకపోతే రాజకీయ పునాది , వ్యక్తిగత విశ్వసనీయత దెబ్బతినిపోతాయని పవన్‌ గుర్తించారు గనకే సూటిగా మాట్లాడేశారు. బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా పిలిచినా తాను సున్నితంగా తిరస్కరించానని జరిగిన సంగతి చెప్పేశారు.స్కిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా వంటి వాటి గురించి కూడా విమర్శనాత్మక ప్రస్తావనలే చేశారు. గో సంరక్షణ హత్యాకాండను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతల కన్నా నిశితంగా ఖండించారు. టిడిపి తొత్తును గాని మోడీ భజన కేంద్రం భజన చేయబోనని ప్రకటించారు. సిపిఐ నేత నారాయణ విమర్శలను ప్రస్తావించి వామపక్షాల పోరాటాలంటే తనకు గౌరవమంటూ మరోసారి చే గువేరా ప్రస్తావన చేశారు. గతంలో చే పేరు చెబుతూ మితవాద బిజెపితో వెళ్లడం పొంతనలేని వ్యవహారంగా వుంటే ఇప్పుడు ప్రజా పోరాటాలనూ చేనూ కలిపి ప్రస్తావించడం సహజంగా అమరింది. చిరంజీవి ఇదే తిరుపతిలో ప్రజారాజ్యం సభ పెట్టిన నాడు చేసిన ప్రసంగంతో పోలిస్తే పవన్‌ కళ్యాన్‌ ప్రసంగంలో స్పష్టత, నిర్దిష్టత ఎక్కువగా వున్నాయి. ఇది ఈ రెండేళ్ల కాలంలోనూ ఆయన సంతరించుకున్న అనుభవం ఫలితమే కావచ్చు. ఇప్పటి వరకూ నా లాటి వాళ్లం ఆయనపై ఏదైనా అంటే విరుచుకుపడిన కొందరు మీడియా సోషల్‌ మీడియా మిత్రులు ఇప్పుడు పవన్‌పై రకరకాలుగా దాడి చేస్తారనేది స్పష్టం. తెలుగుదేశం వ్యూహాత్మకంగా మెత్తగా మాట్లాడినా ఆయన నిజంగా రంగంమీదకు వచ్చి పోరాటాలు చేబడితే భరించే పరిస్థితి వుండదు. గతంలో వలెనే మళ్లీ విందులకు మంతనాలకు పిలిస్తే వెళ్లి గందరగోళానికి అవకాశం ఇవ్వరనే అనుకోవాలి. వైసీపీ ఇప్పటికే వ్యతిరేక వైఖరి తీసుకుంది. సిపిఎం కార్యదర్శి మధు పవన్‌ ప్రసంగంపై హర్షం వ్యక్తం చేశారు. నారాయణ వ్యాఖ్యలు అంతిమమా లేక సిపిఐ నుంచి మరో స్పందన వస్తుందా చూడాల్సిందే. ఏది ఏమైనా కమలం కలలు మాత్రం చెదిరిపోయాయన్నది నిజం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *