కళా సాహిత్య స్రష్ట గుల్జార్‌

395ec2d07cbd7dafe1ceda66ec2f10a0_ls_xl
గుల్జార్‌.. ఆ మాటకు అర్థం పాటల తోట. ఇంకా చెప్పాలంటే మాటల వూట, కళా సాహిత్యాల పసిడి కోట. భారతీయ చలన చిత్ర సాహిత్య రంగాల్లో శిఖరాయమానమైన ఒక సమున్నత వ్యక్తిత్వం గుల్జార్‌. జయహౌ అంటూ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చలన చిత్ర పతాకాన్ని ఎగరేసిన గీతకారుడు. దర్శకుడు. లాలిత్యం, మానవత్వం, భావుకత, సునిశితత్వం,సౌందర్యారాధన, ప్రేమాభినివేశం, దేశభక్తి ఇలా ఎన్నెన్నో విశిష్టతలు కలబోసుకున్న గుల్జార్‌ భారతీయ కళా జగతికి ఒక కానుక. సుగంధ పరిమళ వీచిక.
ఎప్పుడూ మల్లెపూవులాటి కుర్తా పైజామాలతో మామూలు మనిషిలా మన మధ్య సంచరిస్తూ .. ఏ విషయమైనా భేషజం లేకుండా హాయిగా వివరిస్తూ నడయాడే జ్ఞాన సంపన్నుడు గుల్జార్‌. మూర్తీభవించిన కవితా స్వరూపం గుల్జార్‌. ఉర్దూ,హిందీ,పంజాబీ, భోజ్‌ పురి తదితర బహుభాషా కోవిదుడు.
గుల్జార్‌ 1936 ఆగష్టు 18న ఇప్పుడు పాకిస్తాన్‌లో వున్న దినా గ్రామంలో పుట్టాడు. అది జీలమ్‌ జిల్లాలో వుంటుంది. అసలు పేరు సంపూర్ణ సింగ్‌ కర్లా. దేశ విభజన ఆయనపై చెరగని విషాద ముద్ర వేసింది. చెదిరిపోయిన జీవిత స్వప్నంలా ఆయన ఢిల్లీ చేరాడు. అయితే కుటుంబ కష్టాలు ఆయనను నిలవనీయలేదు.
గుల్జార్‌ తండ్రి సర్దార్‌ మకాన్‌ సింగ్‌ కర్లా ఆయన మొదటి భార్య వల్ల ముగ్గురు పిల్లలైతే రెండవ భార్య గుల్జార్‌ తల్లి. అతన్ని కని వెంటనే చనిపోయింది. తర్వాత మకాన్‌ సింగ్‌ మరోపెళ్లి చేసుకుని ఇంకో అయిదు మంది పిల్లలకు తండ్రయ్యాడు. అలా మొత్తం తొమ్మిది మంది పిల్లల్లో ఒకడుగా ఆయన పెరిగాడు. ఆ రోజుల్లో దేశ విభజన కారణంగా తలదాచుకోవడానికి వచ్చేవారితో ఢిల్లీలోని వారి ఇల్లు పెద్ద శరణార్థిశిబిరంలా మారిపోయింది. ఇన్నిటిమధ్యనా గుల్జార్‌ బాల్యంలోనే పద కవితల పట్ల, హిందూస్తానీ సంగీతం పట్ల ఆకర్షితుడైనాడు. అంత్యాక్షరి ఇందుకు బాగా ఉపయోగేపడేది. దాంతో తండ్రి ఆయనను బొంబాయిలో వ్యాపారం చేసుకుంటున్న గుల్జార్‌ అన్నయ్య జస్మీర్‌ సింగ్‌ దగ్గరకు పంపించాడు. అక్కడ కాలేజీలో చదువుకుంటూనే అన్నగారి మోటారు మెకానిక్‌ షాపులో పనిచేయసాగాడు. వాహనాలకు పెయింటింగులు వేసేవాడు. అయితే హృదంతరాళంలో కవితా జ్వాల రగులుతుండేది. రవీంద్ర నాథ టాగోర్‌, శరత్‌ చంద్ర చటర్జీ రచనల అనువాదాలు ఆయనపై బాగా ప్రభావం చూపించాయి. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘంతో అనుబంధం పెంచుకుని పని చేయసాగాడు.తమ్ముడు జీవితానికి పనికి వచ్చే విషయాలు నేర్చుకోకుండా కవిత్వంలో కొట్టుకుపోతున్నాడని అన్న ఆందోళన పడి అనేక అంక్షలు పెట్టాడు. ఇక ఆయనతో లాభం లేదనుకుని బయిటకు వచ్చేశాడు. అప్పుడే ఆయన బిమల్‌ రారు దృష్టిలో పడ్డాడు. 1961లో తన దగ్గర సహాయకుడుగా చేరాడు. 1963లో .బిమల్‌ రారు తీసిన బందినీ చిత్రం కోసం రాసిన మేర గోర ఆంగ్‌లైలీ అన్నది ఆయన మొదటి పాట. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌. ఈ చిత్రానికి గీతాలు రాసిన శైలేంద్ర ఈ పాటను మాత్రం గుల్జార్‌ను రాయవలసిందిగా కోరాడు. నూతన్‌పై ఆ పాట వుంటుంది. గుల్జార్‌ బిమల్‌ రారు దగ్గర సహాయ దర్శకుడుగా పూర్తి స్థాయిలో పనిచేశాడు. దానివల్ల ఆయన ఎంతో నేర్చుకున్నాడు. ఈ విషయాలన్ని కలగలపి రావి పర్‌ అని పుస్తకం కూడా రాశాడు. రావి పార్‌ అన్న ఈ పుస్తకం కళా సృజనలో కష్టనష్టాలను కళ్లకు కడుతుంది.
బిమల్‌ దగ్గర పనిచేసిన తర్వాత దశలో గుల్జార్‌ హృషీకేశ్‌ ముఖర్జీ అసిత్‌ సేన్‌ వంటివారి చిత్రాలకు రచనలందించాడు. హృషీదా కోసం ఆయన ్‌ఆనంద్‌(1970)లో అమితాబ్‌ బచన్‌, రాజేష్‌ ఖన్నా నటిస్తే గుడ్డి(1971)లో జయబాదురి పరిచయమైంది. గుల్జార్‌ బాగా విజయవంతమైన పాటలు రాసింది మాత్రం సచిన్‌ దేవ్‌ కుమారుడైన రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ సంగీత దర్శకత్వంలోనే.. గుల్జార్‌ స్వీయ దర్శకత్వంలో అందించిన చిత్రాలన్నిటికీ సంగీతం సమకూర్చింది ఆర్‌.డి.బర్మనే! 197లో పరిచరు, 1975లో ఖుష్బూ, ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తీసినట్టు చెప్పబడిన ఆంధీ(1975), ఆంగూర్‌(1982),ఇజ్జత్‌(1987) తదితర చిత్రాలన్నిటికీ ఆర్‌డిబర్మన్‌ స్వర కల్పపే ప్రాణం పొసింది. అందుకే ఆయన తన జీవిత నౌకకు చుక్కాని అంటాడు గుల్జార్‌.
గుల్జార్‌ రాసిన సుమధుర గీతాలు కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే వంటివారి కంఠ స్వరంలో అమృతం చిలికించాయి. ప్రసిద్ద సంగీత దర్శకులందరితోనూ ఆయన అవార్డుల వర్షం కురిపించారు. సలీల్‌ చౌదరితో ఆనంద్‌,మేరే ఆప్నే, మదన్‌ మోహన్‌తో మౌసమ్‌, విశ్వ భరద్వాజ్‌తో మాచిస్‌, ఓంకార, కామినే, ఎఆర్‌రహ్మాన్‌తో దిల్‌సే, గురు,స్లమ్‌ డాగ్‌ మిలియనిర్‌,రావణ్‌ ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన గీతాలందించిన ఘనత ఆయన స్వంతం.
1971లో మేరే ఆప్నేతో గుల్జార్‌ దర్శక జీవితం మొదలైంది. 1969లో తపన్‌ సిన్హా అందించిన అప్నాజన్‌ ఆధారంగా ఈ చిత్రం తయారైంది.ఇందులో మీనాకుమారి నాయిక. నగ్జలైట్‌ ఉద్యమంపై నుంచి ఉత్తర భారతంలో సమస్యలపైకి కేంద్రీకరణ మార్చాడు గుల్జార్‌. నిరాశోపహతులైన నిరుద్యోగులలో విశ్వాసం కలిగించే నాయికగా మీనాకుమారి ఈ చిత్రంలో గొప్పగా నటించారు. ఆ మరుసటి ఏడాది పరిచరు సున్నితమైన మానవ సంబంధాల కథ. దాంతో పాటే కోసిష్‌. ఎప్పటికీ అపూర్వమైన ఒక ప్రయోగం.వినికిడి లేని మాట రాని జంట మధ్య అనురాగానికి అపురూప చిత్రణ. ఆ చిత్రంలో జయ బాదురి సంజీవ్‌ కుమార్‌ నటించారు. అప్పటి నుంచి గుల్జార్‌ సంజీవ్‌ కుమార్‌ కలయికతో ఆధీ, మౌసమ్‌, అంగూర్‌, నంకీన్‌ వంటి మంచి చిత్రాలు వెలువడ్డాయి.ఆంధీలో నాయిక సుచిత్రా సేన్‌ అచ్చు ఇందిరాగాందీలా వుండటంతో అత్యవసర పరిస్తితిలో సమస్యలను ఎదుర్కొంది. గుల్జార్‌ చిత్రాలన్నిటిలోనూ ఫ్లాష్‌ బ్యాక్‌ తప్పనిసరిగా వుంటుంది. ఆ విధంగా కాలం నిరంతరాయతను ఆయన చెబుతుంటాడు.
నటీనటుల ప్రతిభను గుర్తించడంలో గుల్జార్‌ సిద్ధ హస్తుడు. ఇప్పుడు సుప్రసిద్ధులైన వారెందరో ఆయన ద్వారానే పరిశ్రమలో కాలు మోపారు.మరికొందరు ఆయనతో పని చేశాక స్థిరపడ్డారు. జయబాదురి,జితేంద్ర,వినోద్‌ ఖన్నా,హేమమాలిని, వంటివారు ఇందుకు ఉదాహరణలు.
గుల్జార్‌ ఇతరుల కోసం రాసే పాటలు ఒక ఎత్తు., ఆయన స్వంత చిత్రాల్లో సంగీతం మరో ఎత్తు. ఉదయం మీరు పాడే ప్రార్థనా గీతం నుంచి పాలవాడి కేక నుంచి ప్రతిదీ సంగీతంతోనే మొదలవుతుంది అంటాడాయన. స్వతహాతా ఉర్దూ రచయిత అయినప్పటికీ బెంగాలీ ప్రభావంతో శరత్‌ బాబు నవల ఆధారంగా కితాబ్‌, సమరేష్‌ బాసు రచన ఆధారంగా నంకీన్‌ రూపొందించారు.
గుల్జార్‌ నటి రాఖీని పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం కలసి వున్న తర్వాత వారు విడిపోయారు గాని విడాకులు తీసుకోలేదు. సంతానమైన మేఘన గుల్జార్‌ కూడా దర్శకురాలు. తండ్రి జీవిత కథను ‘బి కాస్‌ హి ఈజ్‌.. ‘ పేరిట చక్కటి పుస్తకంగా రాశారు.
గుల్జార్‌ పాటలకు ఫిలిం పేర్‌ అవార్డులు రికార్డు స్థాయిలో 10 సార్లు లభించాయి.సంభాషణలకు 4 వచ్చాయి. జాతీయ అవార్డులు మూడు సార్లు దక్కించుకున్నారు. కోసిష్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే, మౌసంకు ఉత్తమ దర్శకత్వం,ఇజ్జత్‌కు ఉత్తమ పాటల రచయితగా పురస్కారాలందాయి.
గుల్జార్‌ స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ కోసం రాసిన జయహౌ పాట అస్కార్‌ బహుమానం అందుకోవడం వీటన్నిటికీ మకులాయమానమైంది. అయితే ఆ ఘనత రెహ్మాన్‌కే దక్కుతుందని వినయంగా చెబుతాడు.’ ఒక భారతీయ చిత్ర గీతానికి అస్కార్‌ వస్తుందని నేను ఎంత భయంకరమైన కలలో కూడా అనుకోలేను. పాశ్చాత్య సంగీతంలో ఈ పాటలకు స్థానమే లేదు. అందువల్లనే ఇది పూర్తిగా రహ్మాన్‌ ఘనత’ అని స్పష్టంగా చెబుతారు.
గుల్జార్‌ జీవితం సినిమాలకే పరిమితం కాదు. అక్షరాలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంపైన ఆసక్తితో సినిమాలవైపు మరలాడే తప్ప ఆ వ్యామోహంతో వచ్చిన వాడు కాదు. అందుకే సినిమాలలో తలమునకలవుతున్నా కవిత్వాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నిరంతరం ఏవో కవితా సంపుటాలు వెలువరిస్తూనే వుంటారు. దేశ విదేశాలలో కవి సమ్మేళనాల్లో ముషాయిరాల్లో పాల్గొనడం ఎంతో ఇష్టం.
పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రాశారు. వాటిలో ఒకటి జాతీయ బహుమతి కూడా పొందింది! బుల్లితెర కోసం జంగిల్‌ బుక్‌, పోత్లి బాబా కీ వంటి బాల సీరియల్స్‌ రూపొందించి వరవడి పెట్టారు.
గుల్జార్‌ ఆకర్షణీయమైన ఆల్బమ్‌లనూ విడుదల చేశారు వికలాంగుల సంక్షేమం వంటి సామాజిక కార్యక్రమాలకు చేయూత నిస్తారు.
గుల్జార్‌కు సాహిత్యమంటే ఎంత ప్రాణమో చెప్పడానికి మీర్జా గాలిబ్‌ సీరియల్‌ ఒక ఉదాహరణ. 1988లో దూరదర్శన్‌ కోసం తీసిన ఈ సీరియల్‌ చాలా నాణ్యమైందని విమర్శకుల ప్రశంసలు పొందింది. దీని ఖర్చు పెరక్కుండా చూడటం కోసం ఆయన తన పారితోషికం కూడా వదులుకున్నారట. మున్షీ ప్రేమ్‌ చంద్‌ పైన కూడా అలాగే ప్రత్యేకంగా పనిచేశారు.
1971-86 మధ్య ఒకటిన్నర దశాబ్దం గుల్జార్‌ చలన చిత్ర జైత్రయాత్ర సాగించారు.తర్వాత కాలంలో సహజంగా కొంత వెనక పట్టుపట్టినా 1996లో మాచిస్‌తో మరోసారి రంగంపైకి వచ్చారు.అయితే హూ టూ టూ ఆయనకు నిరాశ మిగిల్చింది. ఇందుకు చాలా కారణాలున్నాయంటారాయన. నిర్మాతల వత్తిడి వల్ల చిత్రాల కథలు సంభాషణలు మార్చుకోవలసి రావడం ఆయనకు కష్టం కలిగిస్తుంది. హూ టూ టూ లో బలవంతంగా వేసిన కత్తిరింపులే నష్టం చేశాయన్నది ఆయన భావన. అయితే దానిపై ఏమీ విమర్శలు చేయరు. అయితే
ఇన్ని ప్రజ్ఞా పాటవాలు గల గుల్జార్‌ తన రచనా వ్యాసంగాన్ని గురించి ఎలాటి ఆర్బాటాలూ చేయరు.’ నేనొక గుమాస్తాలా రోజూ ఉదయం 10.30 నుంచి సా.5.30 వరకూ రాస్తుంటాను.నాకు ఏది తడితే అది రాస్తాను. కథ కవిత్వం పాట ఏదైనా సరే.. ‘ అని తన శైలిని వివరిస్తారు. ఇన్ని రకాల బాధ్యతలు నిర్వహించిన మీకు వ్యక్తిగతంగా ఇష్టమైన పని ఏది అంటే హాయిగా నవ్వేస్తారు. నేను ఒక కొడుకును.తండ్రిని.బాబాయిని.మామయ్యను. అన్నయ్యను.. ఇవన్నీ నేనే కదా.. అలాగే నేనొక రచయితను. కవిని.. దర్శకుణ్ని.’ అని చమత్కారంగా జవాబిస్తారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా కళాభిరుచిని సృజనను కొనసాగిస్తూనే వుంటారు. యువతకు హితుడుగా స్నేహితుడుగా నిలిచి ముందుకు నడిపిస్తుంటారు.
భారతీయ కళా సాహిత్య రంగాలలో తరాల వారధి వంటి ఈ మాటల కోటీశ్వరుడు దాదాసాహెబ్‌ ఫాల్కే దక్కడం కళాభిమానులందరికీ ఆనందదాయకం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *