ప్రాచీన హోదా ఓకే- 100 కోట్ల మాట?

 

maxresdefault copy

 

తెలుగు భాషకు ప్రాచీన హౌదా కల్పించడం సబబేనని మద్రాసు హైకోర్టు తీర్పునివ్వడం సంతోషకరం. ఒక తమిళ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌లో న్యాయస్థానం తీర్పునిస్తూ నిబంధనల ప్రకారమే ప్రాచీన హౌదా కల్పించినట్లు స్పష్టం చేసింది. 2005-06లో ఈ సమస్య తలెత్తినప్పటి నుంచి వ్యవహారం గజిబిజిగానే ఉంది. రాజకీయ అవసరాల కోసం యూపిఎ ప్రభుత్వం తమిళానికి మాత్రమే ప్రాచీన హౌదా కల్పించడంతో సమస్య మొదలైంది. క్లాసిక్‌ లాంగ్వేజ్‌ అంటే శ్రేష్ట భాష, ప్రామాణిక భాషా అని అర్థం తప్ప ప్రాచీనత ప్రశ్న లేదని చాలా మంది చెప్పారు. అయినా అప్పటికే ప్రాచీన హౌదా అన్న పదం స్థిరపడిపోయింది. తమిళానికి మాత్రమే ఆ హౌదా ఇవ్వడం సరికాదని తెలుగునాట విపరీతమైన నిరసన వ్యక్తమైంది. నాటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దానికి అనుకూలంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. వేటూరి సుందరామ్మూర్తి ఈ సమస్యపై తనకు లభించిన జాతీయ పురస్కారాన్ని తిరస్కరించారు కూడా. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన తమిళం, తెలుగు అటుఇటుగా పెంపొందినవేనని చరిత్రకారులు చెబుతున్నారు. 2500 ఏళ్ల క్రిందటే తెలుగు స్వతంత్రంగా విడివడింది. క్రీ.పూ 273 నాటి అశోకుని శాసనాలను నాటి పర్యాటకులైన మొగస్థనీస్‌ వంటివారి రచనల్లోనూ ఆంధ్రుల ప్రస్థావన ఉంది. ఆంధ్రులు వీరులు, ధర్మాచరణపరులని అశోకుడు రాయించాడు. భాషా సాహిత్యాలు లేకుండా ఇవన్నీ జరిగిఉండవు. అయితే నన్నయ్య ఆదికవి అంటూ అదేపనిగా కీర్తించటం తెలుగు భాష చరిత్రకు చెరుపుచేసిన మాట నిజం. ఆదికవికి ముందు సోదికవులు – అంటే జానపదులు, ప్రజా కళాకారులు వంటివారిని మనం అస్సలు పట్టించుకోలేదు. జైన బౌద్ధ విశ్వాసాలకు చెందిన తెలుగు సాహిత్యం మనం పట్టించుకోలేదు. తమిళులు జైనానికి సంబంధించిన తొలినాటి సాహిత్యాన్ని భద్రపరుచుకోవడం వల్ల సాధికారికంగా తమ భాషా చరిత్రను నిరూపించుకున్నారు. మనం వైదిక కోణం చుట్టూ పరిభ్రమిస్తూ చరిత్ర కోల్పోయాం. అయినా సరే ఏకపక్షంగా ఒక్క తమిళానికి మాత్రమే హౌదా ఇచ్చి మిగిలిన వాటిని చిన్నబుచ్చటం సమంజసం కాదు.హేతుబద్ధం కూడా కాదు. అందుకే ఆలస్యంగానైనా మిగిలిన భాషలకు హౌదా ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని భరించలేక కొంతమంది దురభిమానులు తమిళం మాత్రమే గొప్పదని, సృష్టి జరగడానికి ముందే ఒక రాయిపై తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం లేని కథలు కాకరకాయలు ప్రచారంలో పెట్టారు. ఇది ముదిరి పైన చెప్పుకున్న న్యాయవాది కోర్టుకు కూడా వెళ్లి భంగపడ్డారు.
ఇంతవరకు బాగానే ఉందికానీ ప్రాచీన హౌదా తర్వాత సాధించిందేమిటి? కేంద్రం ఇచ్చిన 100 కోట్ల రూపాయలు నిరర్థకంగా సెంట్రల్‌ యూనివర్సిటీలో మగ్గిపోతున్నాయి. విభజనకు ముందు తరువాత కూడా ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేయడం లేదు. ఈలోగా కొంతమంది బుద్ధిశాలులు తమ పథకాలకు మంజూరు చేయించుకోగలిగారు. ఎపి, తెలంగాణల మధ్య అనేక అంశాలు వివాదంగా ఉండొచ్చు కానీ తెలుగు భాషాభివృద్ధి విషయంలో అవవసరం లేదు. ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యంలోనైనా సదరు హౌదాను, నిధులను సక్రమంగా వినియోగించుకోగలమా? నిర్ధిష్టంగా తెలుగు భాషాభివృద్ధికి అడుగులు వేస్తామా?

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *