నిజాయితీపరులా?జిత్తుల మారులా?- 2

CroppedImage608342-hypocrites-ideallists-and-liars

ఈక్యూ సంగతి ఎలా ఉన్నా అసలు ఎవరైనా నిజాయితీపరులో కాదో చూసుకోవడానికి మరో ఆరు అంశాలు చెప్పుకోవచ్చు.

7. విశ్వసనీయత
నిజాయితీపరులు నమ్మదగిన మనుషులై ఉంటారు కనుక అందరూ వారిపట్ల మొగ్గు చూపుతారు. అవతలివారు నిజంగా లోలోపల ఏమనుకుంటున్నారో తెలియనప్పుడు వారిని ఇష్టపడడం చాలా కష్టం. కానీ నిజాయితీ గలవారి మాటలకు, చేతలకు తేడా ఉండదు. తాము అనుకున్నదే చెబుతారు. ఏదైన మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. ఏదో పని పూర్తి కావటానికి లేదా త్వరగా ముగించడానికి అలా అన్నాను అంటూ వారెప్పుడు తప్పుకోవడానికి ప్రయత్నించరు. తాము నిజమనుకుంటున్నదే వారు చెబుతున్నారని మీకు అర్థమైపోతుంది.

8. ధృడమైన వ్యక్తిత్వం
నిజాయితీపరులైన వారికి బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. లేనిపోని ఆరోపణలు, సాకులు చూపించి తప్పుకోవడానికి వారెప్పుడూ ప్రయత్నించరు. తమను నొప్పించారని (హర్ట్‌) అనవసరమైన రభస చేయరు. ఎవరైనా తమ అభిప్రాయాలను విమర్శించినంత మాత్రాన అవమానం జరిగినట్లు రగిలిపోరు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని పథకాలు వేయరు. ఏవి సానుకూలం ఏవి ప్రతికూలం అని అర్థం చేసుకోగల్గుతారు. ఉపయోగపడిన మేరకు తీసుకుని మిగిలింది పట్టించుకోకుండా వదిలేస్తారు. అంతేగాని ఎలాంటి ద్వేషభావనలు పెంచుకోరు.

9. కపటత్వం ఉండదు
నిజాయితీపరులు తాము చెప్పిందే ఆచరిస్తారు. మీకొకటి చెప్పి అందుకు భిన్నంగా వారు వ్యవహరించరు. వారికి ఉండే స్వీయ చైతన్యం, బాధ్యతాయుత మనస్తత్వం ఇందుకు కారణం. కపటులైన వారు తమ ద్వంద్వ నీతులను కూడా గుర్తించలేరు. తప్పులు తెలుసుకోరు. తమ బలహీనతలు పట్టించుకోరు. ఇందుకు భిన్నంగా నిజాయితీపరులు ముందు తమ స్వంత లోపాలేంటో నిర్ణయించుకుంటారు.

10. నిర్లక్ష్యం ఉండదు
నిజాయితీపరులైన వారు మీతో మాట్లాడుతుంటే మొత్తం దృష్టి మీమీదే కేంద్రీకరిస్తారు. ఎవరైనా ఊరికే పలకరించి అంతలోనే మొబైల్‌లో మాట్లాడ్డం, మెసేజ్‌లు పంపడం చేస్తే ఎలా ఉంటుంది? అంటే వారి మనసులో మీపై ఆసక్తి లేదనిపిస్తుంది. నిజంగా శ్రద్ధ పెట్టి మాట్లాడ్డం కుదరదు. నిజాయితీ గలవారు ఇలాంటి పని ఎప్పుడూ చేయరు. అవతలివారిపై ఆసక్తి ఉంటుంది గనక చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు. తమ అనుభవాలు, భావాలు పంచుకుంటారు.

11. కోతలు కోయరు
తమ గొప్పతనం గురించి, ఘనకార్యాల గురించి అదేపనిగా చెప్పుకునేవారు. మనకు తారసపడుతుంటారు. అలా ఎందుకు చేస్తారనిపిస్తుంది. నిజానికి వారు చాలా అభద్రతో ఉంటారు. తమ విజయాలు తాము చెప్పుకోకపోతే ఎవరు పట్టించుకోరని భయపడుతుంటారు. నిజాయితీగలవారికి అలా గొప్పలు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు. తాము సాధించనవాటి గురించి వారికి విశ్వాసం ఉంటుంది. అయితే నిజంగా ఏదైనా గొప్ప పని చేసి ఉంటే దానికదే నిలబడుతుందని నమ్ముతారు. ఎంతమంది తెలిసింది. మరెంత మంది పొగుడుతున్నారు అనేది ప్రధానంగా తీసుకోరు.

12. నిగర్వ ప్రవర్తన
నిజాయితీపరులైన వారు తమ స్వాతిశయాలను, అహంభావాలను బట్టి నిర్ణయాలు తీసుకోరు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు మరెవరో సాధించిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే ధ్యాస వారికి అస్సలు ఉండదు. హంగామాకు కూడా ఇష్టపడరు. అందరూ చూడండహో అని మోత మోగించకుండానే చేయాల్సింది చేసుకుపోతుంటారు.
……………….
కనుక మీకు మీరుగాని లేక మీకు తారసపడే వాళ్లను గానీ సరిగ్గా అంచనా వేయాలంటే ఈ కొలబద్దలు ఉపయోగపడతాయి. నిజాయితీగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం, సంతృప్తి పెరుగుతాయి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *