చంద్రబాబు వ్యాఖ్యలపై సందేహాలు

చంద్రబాబు వ్యాఖ్యలపై సందేహాలుbabu222222

విజయవాడ పరిసరాలలోనే రాజధాని వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటినుంచి సూచిస్తూ వచ్చారు. తర్వాత మంగళగిరి పేరు కూడా వినిపించింది. రెండూ దగ్గరే గనక ఫర్వాలేదనుకున్నారు. అయితే ఆయన రెండు చోట్ల నిర్మాణాలు చేయడం గాక అమరావతి అనే కొత్త పేరతో భూములు ఖాళీ చేయించి నూతననగర నిర్మాణం చేపడతారని బాగా దగ్గరి వారికి తప్ప ఇతరులకు తెలియదు. ప్రపంచ స్థాయి నగరం వగైరా ప్రచారాలతో అదైనా మంచిదే అనుకుని సరిపెట్టుకున్నారు.భూముల సమీకరణపై ప్రతిపక్షాలు విమర్శలు ఆందోళనలు చేస్తున్నా రైతుల్లో పెద్దభాగం సహకారం అందించారు. మరోవైపున ఇదంతా జరిగేవరకైనా తమకు లాభం వుంటుందని విజయవాడ గుంటూరు ప్రజలు ఆశపడ్డారు. అయితే ఇప్పుడు తాత్కాలిక రాజధాని నిర్మాణం తర్వాత భూములిచ్చిన వారిలోనూ సందేహాలు మొలకెత్తాయి. ఏది ఎక్కడ ఎప్పటికి కట్టి మాకేమిస్తారు అని వారు ఆలోచించడం అనివార్యమైపోయింది. వారికంటే కూడా విజయవాడ గుంటూరు వాసులకు తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తింది. ఏమంటే ఇక్కడ భూముల లావాదేవీలు చాలా కాలం నిలిపేశారు. తర్వాత వ్యవసాయ జోన్లుగా ప్రకటించి అక్కడ పట్టణీకరణ అసలే వద్దన్నారు. మీరు 50వేల ఎకరాలు తీసుకుని అధికారికంగా నగరీకరణ చేస్తామంటూ మా భూములు మేము అమ్ముకోవద్దని శాసించడం ఏమిటని నిరసన పెరుగుతున్నది. అమరావతిలో అనుకున్న మేరకు అమ్మకాలు జరగకపోవడం వల్లనే ఇతర చోట్ల భూముల వ్యాపారం నిలిపేయించారని,అక్కడ అమ్ముకున్నాకే ఇతరులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనవాక్యంగా వుంది.

మరో వైపున ముఖ్యమంత్రి పదేపదే విజయవాడ ప్రాంతంలో అద్దెల గురించి, భూముల రేట్ల గురించి ప్రస్తావించడం ఇళ్ల యజమానులకు రుచించడం లేదు. రాజధాని వస్తే అభివృద్ధి వస్తుందని ఆశపెట్టిన ముఖ్యమంత్రి అద్దెలు కొంచెం పెరగ్గానే అంతా అయిపోయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఈ మధ్యతరగతి ఇళ్లయజమానులు అడుగుతున్నారు. భూముల లావాదేవీలు స్తంభించిపోయి అనేకమంది సంక్షోభంలో కూరుకుపోతే సిఎం మాత్రం భూముల రేట్ల పెంపు అంటారేమిటండీ అని ఒక రియల్టర్‌ వాపోయాడు. ఒకోసారి ఎందుకు రాజధాని అనిపిస్తుంది అని అధికార కూటమి శాసనసభ్యుడన్నారు. పెట్టుబడులు ప్రవాహంలా వస్తాయని చెప్పిన ప్రభుత్వమే దీనివల్ల పెట్టుబడులు ఆగిపోతాయని ఎందుకు హెచ్చరిస్తున్నది? వూరికే పెట్టుబడులు ఎందుకొస్తాయి? చెప్పిన విధంగా జరగడం లేదు గనక నెపం మా మీద పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారా అని ఒక వ్యాపారవేత్త సందేహం వ్యక్తం చేశారు. ఈ విధమైన సందేహాలు పెరిగిపోయినందునే చంద్రబాబు నాయుడు ముందస్తుగా సాకులు వెతుకుతున్నారని ఒక మిత్రుడు వ్యాఖ్యానించారు.
ఇవన్నీ చాలనట్టు ముఖ్యమంత్రి ఈ రోజు ఎల్‌వి ప్రసాద్‌ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో ప్రాంతాల తేడా గురించి ప్రస్తావించడం మరింత అసందర్భంగా వుంది. ఇక్కడ అద్దెలు పెరిగిపోతే పెట్టుబడులు రాయలసీమకు పోతాయని అక్కడికి పోతే వేరే రాష్ట్రాలకు పోతాయని జోస్యం చెప్పారు. నిజంగా రాయలసీమకు పోతే విచారించాల్సిన పని వుండదు కదా. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కొన్ని అనుమానాలు ఆందోళనలు సాగుతుంటే స్వయానా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడ్డం ఎందుకనిా రాయలసీమకు చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అన్నారు. ఆయన మనసులో మాట ఇలా బయిటకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. అవసరాన్ని మించి మాట్లాడ్డం, ముందుగా హౌం వర్క్‌ చేయకపోవడం వల్లనే ఇలాటి తప్పిదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం పాలక పార్టీ నాయకులు తరచూ వ్యక్తం చేస్తున్నారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *