జాతీయ సాహిత్యంలో తెలుగోళ్ల స్థానమేది?

VIjay1111

హైదరాబాదు పబ్లిక్‌స్కూలులో జరుగుతున్న 2016 హైదరాబాదు లిటరరీ ఫెస్టివల్‌ సందర్భంగా సమన్వయ కర్త ప్రొఫెసర్‌ విజయకుమార్‌ చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా వున్నాయి.ఈ ఉత్సవాలకు ప్రసిద్దులతో సహా 150 మంది రచయితలు హాజరుకావడం, యువ పాఠకులు ఆసక్తిగా పాల్గొనడం సంతోషకరమైన అనుభవం. అదే సమయంలో ఇదంతా చూశాక కొన్ని ఆలోచనలుకూడా వచ్చాయి. తెలుగు సాహిత్యకారులను గురించి సామాజిక జీవితం గురించి భారతీయాంగ్ల నవలల్లో ఎందుకు ప్రస్తావనలు దాదాపు కనిపించకపోవడానికి కారణమేమిటన్నది నా ప్రశ్న. శ్రీశ్రీ,చలం వంటివారితో సహా తెలుగు మహా రచయితల గురించి బయిట తెలిసింది చాలా తక్కువనేది ఎప్పుడూ చెప్పుకునేదే. అనువాదాలు జరక్కపోవడం ఇందుకు కారణంగా చెబుతుంటారు. తెలుగువారికి పరస్పర గౌరవం వుండకపోగా ఈర్ష్యలు ఎక్కువని కూడా అంటుంటారు. ఇవన్నీ మామూలుగా మాట్లాడుకోవడానికి బావుంటాయి గాని శాస్త్రీయ చారిత్రిక కారణాలవుతాయా అనేది సందేహం. పాతకాలపు రచయితలు తెలియకపోవడం అటుంచి ఇప్పుడు ఇంగ్లీషులో రాసి పేరు(డబ్బు కూడా) తెచ్చుకున్న చేతన్‌ భగత్‌ లాటి వారు ఇక్కడి నుంచి ఎందుకు రావడం లేదు? పోనీ వారి రచనల్లో ఈ తెలుగు రాష్ట్రాల గురించి ఎందుకు రాయడం లేదు? కందుకూరి గురించి గురజాడ గురించి కొంత ప్రస్తావన కనిపిస్తుంది. గురజాడ అప్పారావు మొదట సారంగధర రాసిందే ఇంగ్లీషులో గనక శంభుచంద్ర ముఖర్జీ దానిపై చర్చ చేశారు. అది మినహాయిస్తే తొలినాటి కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, అభ్యుదయ సాహిత్యం, నగ్జలిజం, గతంలోని ప్రత్యేక ఉద్యమాలు, తిరుపతి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అనేకచారిత్రిక ప్రదేశాలు, తెలుగు దేశం విజయం, సారా వ్యతిరేక ఉద్యమం, కారంచేడు చుండూరు వంటి ఘాతుకాలు, ఇటీవలి తెలంగాణ ఉద్యమం దళిత స్త్రీ వాద ఉద్యమాలు విస్తారమైన సినిమా రంగం వంటివి ఎందుకు ఇతివృత్తాలు కాలేకపోయాయి?
ఆనాటి మద్రాసు రాష్ట్రంలో విజయనగరం, బందరు, మదనపల్లి వంటివి గాని , నిజాం కాలం నాటి హైదరాబాదు గాని ఇంగ్లీషు సాహిత్యంతోనూ ఇంగ్లీషు పాలకులతోనూ బాగా సంబంధాలసు కలిగివున్నవే. అయినా హైదరాబాదు గురించికూడా పెద్దగా సాహిత్య ప్రస్తావనలు లేవు. మొన్నటి సమావేశాలకు హాజరైన నయనతార సెహగల్‌ మతశక్తుల అసహనం గురించి మాట్లాడితే గవర్నర్‌ నరసింహన్‌ ఖండించడం ఒక విపరీతం. అదలా వుంచితే ఆమె హైదరాబాదు రావదం ఇదే మొదటిసారట! కొల్‌కతా, చెన్నై, ముంబాయి బ్రిటిష్‌ పాలనలో కేంద్రాలుగా వెలుగొందిన పరిస్థితి దక్షిణాదికి లేకపోవడం వల్ల మన గురించి జాతీయ స్థాయిలో రావలసినంత అవగాహన రాలేదన్నది ఒప్పుకోవలసిన నిజం. శ్రీశ్రీతో సహా చాలా మంది ప్రసిద్ధులు చెన్నైలో నివసించినా వారికి త మిళనాడులో ప్రచారం శూన్యం.తెలుగువారికి సుబ్రహ్మణ్య భారతి నుంచి జయకాంతన్‌ వరకూ తెలుసు. కన్నడంలో గిరీష్‌ కర్నాడ్‌లు మళయాలంలో తగళి శివశంకర పిళ్లెలు అందరితో అంతో ఇంతో పరిచయం. ఈ విధమైన ఆదాన ప్రదానాలు తెలుగు సాహిత్యకారుల విషయంలో లేకపోవడం నిజంగా బాధాకరం. మహానగరాల్లో వుండే తరహా ప్రతిష్టాత్మక కళాశాలలు మనకు ఎన్ని వున్నాయి?కళాసాహిత్యాలుచరిత్ర అధ్యయనాల పట్ల ఎంత వరకూ ఆదరణ వుంది అంటే సమాధానం లేదు. ఇది మరో కారణం.
యువ రచయితలైనా ఎందుకు రాలేదంటే గత పదిహేను ఇరవై ఏళ్లలో మనం కేవలం ఎంట్రన్స్‌ల చుట్టూ అరకొర ఇంగ్లీషు మీడియం చుట్టూనే తిరుగుతున్నాం. ఫలితంగా మనకు శక్తివంతమైన రచనలు చేసే వారు కొరవడ్డారు. వున్నంతలో కవిత్వం రాసినంతగా వచనం రాయడం లేదు. ఇది విజయకుమార్‌ విశ్లేషణ. ఇందులోసత్యం వుంది. కొంతమంది యువతీయువకులు ఇంగ్లీషులో కవిత్వం రాస్తున్నారు దాన్ని పరిశీలించి ప్రోత్సహించవలసిన బాధ్యత పెద్దలపై వుంటుంది.
చివరి లేదా మొదటి కారణం – తెలుగు రచయితల పుస్తకాలకు ప్రచురణ కర్తలు లేకపోవడంతో వారే ప్రచురించుకోవడం. అమ్మకం లేదా అవసరం వున్న రచనలు తప్ప ఇతరమైనవి ప్రచురించేవారు దొరకడం ఎప్పుడైనా కష్టమే. పైగా ఇప్పుడు రచయితలలో ఒక భాగం ఆర్థిక స్తోమత కారణంగా తాము వేసుకోవడం సాధ్యపడుతున్నది. శ్రీశ్రీ మహాప్రస్థానమే చాలా ఆలస్యంగా ముద్రితమైంది. గురజాడ కూడా ప్రచురణ సమస్యను కన్యాశ్కులం పీఠికలోనే పొందుపర్చారు.ఇప్పుడా పరిస్థితి లేదు. కాని- స్వయం ప్రచురణలు కావడంతో విమర్శనా దృష్టి ప్రమాణాలు కూడా పలచబడుతుంటాయి. ఇంగ్లీషులో ఒక పుస్తకం ప్రచురణ కావాలంటే చాలా ప్రక్రియ వుంటుంది. ఏజంట్ల నుంచి పరిశీలనగా చదివే పాఠకుల వరకూ వుంటారు.తర్వాత ప్రమోషన్‌ ప్రక్రియవుంటుంది. ఈ కారణంగా వైవిధ్యం నూతనత్వం లోతు తప్పనిసరి అవతుంటాయి. వంద సినిమాలకుపైగా రాయడమే గాక సాహిత్యంపైన కూడా అపారమైన ఆసక్తి కలిగిన ఒక రచయిత ఇటీవల ఇతర భాషల సాహిత్యం చదివాక మన తెలుగులో లోతు తక్కువేనని అన్నారు. అలా అంటే చాలా మందికి చాలా కోపం వస్తుంది గాని నిజం నిజమే. తెలుగు పుస్తకరంగం విస్తరించకపోవడానికి అదో ప్రధాన కారణం. చరిత్ర సమాజం వంటి వాటి ప్రగాఢ పరిశీలన లేకుండా భావ ప్రసరణ లేదా వైయక్తిక అనుభూతులే ప్రధానంగా రచనలు చేసే ధోరణి మారితే గాని తెలుగులో సృజనాత్మక సాహిత్యం విస్తరించదు. పాఠకులకు వాటిని చేరువ చేసే పని కూడా సమాన స్థాయిలో జరగాల్సి వుంటుంది. కొత్తవారిని ప్రోత్సహించేందుకు సీనియర్లు పెద్ద మనసు చూపించాలి కూడా.
ఇవన్నీ విమర్శలు కావు. ఈ వ్యాఖ్యలన్నీ సమగ్రమైనవీ కావు. కొన్ని ఆలోచనలు మాత్రమే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *