అమరావతీ నగర ……అయోమయావస్థ..


అంగరంగ వైభోగంగా శంకుస్థాపన పూర్తిచేసుకున్న ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పథకంపై అయోమయం పెరుగుతున్నది. ఈ నిర్మాణానికి పట్టే కాల వ్యవధి, , భూములిచ్చిన రైతుల పరిస్థితి, బతుకు తెరువు కోల్పోయిన గ్రామీణ పేదల గతి, పక్కనున్న గుంటూరు విజయవాడలపై దాని ప్రభావం ఇలా ప్రతి అంశమూ ప్రశ్నార్థకమవుతోంది. సింగపూర్‌ స్మరణ మారుమోగించి తర్వాత జపాన్‌,చైనాలను కూడా రంగంమీదకు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశీయ భవన నిర్మాతలకు ఆహ్వానం పలకడంతో అసలు ఏం జరుగుతున్నదనే వ్యాఖ్యలు మొదలైనాయి. ఆసక్తి వ్యక్తీకరణలు ఆహ్వానిస్తూ శుక్రవారం నాడు పత్రికల్లో క్రిడా టెండరు అధికారికంగా నోటీసు కూడా ఇచ్చింది.

3000 కోట్ల ఖర్చుతో 40 అంతస్తులతో సచివాలయం నిర్మించాలనేది మొదటి ప్రాధాన్యత అని వార్తలు వచ్చాయి.ముందుగా ఇది పూర్తయితే గాని రాజధానికళ రాదని చెబుతున్నారు. ఇందుకు అంతర్జాతీయ తరహాలో నిర్మాణం చేయాలంటే సమయం పడుతుంది గనక యుద్ధ ప్రాతిపదికన దేశీయ నిర్మాణసంస్థలకు అప్పగించాలనేది తాజా నిర్ణయం. దీంతోపాటే అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాల గురించి కూడా ఏవో కథనాలు వదులుతున్నారు. నూతన రాజధాని అన్న ఆలోచన వచ్చినప్పుడే ప్రాధాన్యతా క్రమంలో ముందు ఇలాటివి పూర్తి చేసుకుంటూ వెళ్లాలని రాజకీయ పక్షాలూ ప్రజాసంఘాలూ మేధావి వర్గాల నుంచి సూచనలు వచ్చాయి. కాని మేము ప్రపంచ స్థాయి వినూత్న నగరం గురించి ఆలోచిస్తుంటే మీరు తక్కువగా మాట్లాడుతున్నారని హేళన చేశారు. 16 నెలలు గడిచాక చెవులు కొట్టుకుంటూ అదే దారిపట్టారు. ఇక నిర్మాణ బాధ్యత విషయంలో ఇంత పెద్ద దేశంలో ఎవరూ లేరా అంటే సింగపూర్‌ ప్రదక్షిణాలు చేశారు. మనమే కట్టుకోవాలని ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే ముందు అక్కడికెందుకు అన్నిసార్లు తిరిగారు? ఈ మలుపుల వెనక మతలబులు ఏమిటి? దేశంలోనే తొలిసారి మొత్తంగా పీపీపీ నమూనాలో నిర్మిస్తున్న రాజధాని రాజకీయాలలో రసవత్తరమైన ప్రశ్నలివి.
ఇక రెండోది- భూ సమీకరణకు భూములిచ్చిన రైతుల సమస్య. ఇక్కడ పెరిగే ఆర్థిక కార్యకలాపాల వల్ల లాభం ఇక్కడి వారికే దక్కాలని నా ఆలోచన అని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. ఎకరాకు యాభై గజాలు డెవలప్‌ చేసిన కమర్షియల్‌ ప్లాట్‌ వస్తుందని వూరించారు. అయితే క్రిడా ఈ మేరకు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదని గుర్తుంచుకోవాలి. ఐచ్చికంగా ి భూములు ఇస్తున్నట్టు మాత్రమే రాయించుకున్నారు. ఆ భూమిని కంపెనీలకు అప్పగించి చేతులు దులిపేసుకుంటారు. సమీకరణ అంటూ భారీ ఎత్తున సేకరించిన రైతుల భూముల్లో వారికి దక్కేది 8500 ఎకరాలని లెక్కతేల్చారు. అదైనా తిన్నగా ఇస్తేనే. ఇటీవల ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగిన క్రిడా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే సమాధానాల కన్నా సందేహాలే ఎక్కువగా
కనిపిస్తున్నాయి.
ఇచ్చే భూమిని వాణిజ్య గృహావసరాలు అని రెండుగా విభజించి వేశారు. మామూలుగా డెవలపర్లు అన్నిటినీ కలగాపులగంగా చూపించడం అందరికీ అనుభవమే. ఇక్కడ కూడా ఆ విభజన సవ్యంగా జరగాలనే గ్యారంటీ ఏమీ లేదు. రెండవది ఇందులో ఏ తరహా స్థలానికి ఏ రేటు నిర్ణయించాలన్నది వారి ఇష్టమే. వాణిజ్య, నివాస స్థలాలు 50,125 గజాలకన్నా ఎక్కువగానీ తక్కువగానీ ఇవ్వాల్సి వస్తే డబ్బు చెల్లించి సర్దుబాటు చేసుకోవాలనేది విధానంగా రూపొందుతున్నది. పైకి చాలా తర్కబద్దంగా కనిపించే ఈ విధానం ఆచరణలో చిక్కులతో కూడి వుంటుంది. ఎందుకంటే భూమికి భూమి అన్న సూత్రాన్ని కాదని అవసరాలు అవకాశాల పేరిట ఎక్కువ తక్కువల గజిబిజి చేసే పరిస్థితికి ఇది దారితీయడం అనివార్యం. అందులోనూ ప్రభుత్వ భవనాలు మినహాయిస్తే తక్కిన ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ నిర్మాణాలు వాణిజ్య సముదాయాలు వంటివి పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్లు (దేశ విదేశీ పేర్లతో) నిర్వహిస్తాయి గనక వాటి లాభాల ప్రకారమే కథ నడుస్తుంది. ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర తప్ప ప్రత్యక్ష బాధ్యత వుండదు. క్రిడాకు అంతటి సర్వాధికారాలు కట్టబెట్టబడ్డాయి. ఆచరణలో అధికారుల అధీనంలోని క్రిడాకన్నా ఆర్థికంగానూ అధికార పరంగానూ శక్తివంతులైన బడా వ్యాపార సంస్థల మాటే చెల్లుబాటవుతుంది. హైదరాబాదులో ఎపిఐఐసి అనుభవం అదే. దీనంతటికీ ఎలాటి కాల వ్యవధిగానీ, ప్రజాస్వామిక పర్యవేక్షణ గానీ లేదని గుర్తుంచుకోవాలి. రైతులు ఇతర ప్రజలు ఉద్యమాల మార్గంలోనో న్యాయ పరంగానో పోరాటాలు చేయకపోతే ఈ విధానాలు కొత్త కొత్త సమస్యలకు దారితీయడం అనివార్యం. ఇంతవరకూ ప్రభుత్వం ఒక్క అఖిలపక్షం కూడా జరిపింది లేదు. శాసనసభలోనూ అర్థవంతమైన చర్చ లేదు. ప్రభుత్వ బాధ్యత వున్నప్పుడే శ్రీశైలం నిర్వాసితులకే ఇంకా పరిహారాలు రాని దేశంలో క్రిడా వంటి మధ్యంతర సంస్థ చెప్పుచేతల్లోనే వ్యవహారాలు నడుస్తాయి గనక సమస్యలు ఇంకా ఎక్కువగా వుంటాయి. క్రిడా బాధ్యుడిగా వున్న అధికారి శ్రీకాకుళం జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఈ తరహా ఫిర్యాదులున్నాయని అక్కడి రైతులుచెబుతున్నారు. అమరావతిలోనూ ఆశతోనో నమ్మకంతోనో గత్యంతరం లేకనో భూములు అప్పగించిన రైతులు కూడా అప్రమత్తంగా వుండవలసిందే. ఇక ఉపాధి కోల్పోయిన శ్రామికులు యువకులకు నైపుణ్య అభివృద్ది కబుర్లు వరగబెట్టేది మరింత ప్రహసనంగా వుండబోతుంది. కనుక రాజధానిని ఆహ్వానిస్తూనే రాజకీయ వాణిజ్య క్రీడలను ఎదుర్కోవలసి వుంటుంది.
మూడోది- ఉద్యోగుల తరలింపుపై భిన్న ప్రకటనలు ఈ క్రమంలో విజయవాడ వంటిచోట్ల అద్దెల పెరుగుదల, స్తిరాస్తి వ్యాపారంలో వొడుదుడుకులు అనిశ్చితి పరిశీలించవలసి వుంది. అమరావతిలో నవ నగరాలు నిర్మాణం జరుగుతుందన్నప్పుడే అంత హంగామా దేనికని విమర్శలు చేశాము. ఇక ఇప్పుడైతే ఏకంగా 21 పట్టణాలంటున్నారు. టౌన్‌షిప్పులని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కడ ఇది వరకు పట్టణాలు నగరాలూ ఏవీ లేవా అని ఆశ్చర్యం కలుగుతుంది. విజయవాడ గుంటూరే కాదు, వందల కిలోమీటర్ల దూరం రాజధాని వల్ల లాభం కలుగుతుందని చెప్పిన ప్రభుత్వం ఒక్క అమరావతిలోనే అన్ని పట్టణాలు ఎందుకు కేంద్రీకరిస్తున్నది? హైదరాబాదు అనుభవం నుంచి ఏం నేర్చుకున్నది?ఆ పార్ములానే పునరావృతం చేయడం వల్ల లాభపడేవారెవరు?
ఇప్పటికే విజయవాడ వంటిచోట్ల నిర్మాణరంగంపై చాలా ప్రభావం పడింది.అందరూ అమరావతిలో ఏమవుతుందో చూద్దామన్నట్టు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం గృహ వసతికి సంబంధించి నిర్మాణాత్మక చర్యలూ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో విజయవాడలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోతున్నది. 20 వేలమంది ఉద్యోగులు వివిధ శాఖలకు వసతి కల్పించాలన్న మెళకువ ఏలిన వారికి వుంటే ఈ ఏడాదిన్నర లో ఎన్నో చర్యలు తీసుకుని వుండొచ్చు. కాని భారీ ప్రైవేటు భవనాలకు లక్షల కొద్ది అద్దెలు చెల్లించడం తప్ప స్వంత నిర్మాణాలు పెంచుకునే యోచనే జరగలేదు. ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా ప్రైవేటు భవనంలోనే మకాం వేయాల్సిన స్థితి. చిన్న చిన్న బిల్డర్లే చకచకా అంతస్తులు పూర్తి చేస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తలుచుకుంటే ఇంత అయోమయం ఏర్పడేది కాదు. ప్రయివేటు సంస్థలకూ వ్యక్తులకూ లబ్ది చేకూర్చాలనే ఆలోచనే ఇందుకు కారణమైందన్నది స్పష్టం. దీని వల్ల నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. అసలు రాజధాని ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నామని విజయవాడ శాసనసభ్యులొకరు ఇటీవల మా చర్చలో అన్నారు. ఆయన ప్రభుత్వ భాగస్వామ్య పక్షానికి చెందినవారే. ఆయన నుంచే ఇలాటి తీవ్ర స్పందన రావడానికి బాధ్యత ప్రభుత్వానిదే.ఇప్పటికైనా అయోమయ ప్రకటనలు, ఆపద్ధర్మ పోకడలు మాని సమగ్ర పారరర్శక ప్రణాళికతో అడుగేయడం అవసరం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *